ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణాలో పొత్తుల పై మాట్లడారు. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా విషయమై కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై బుధవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని, తెలుగుదేశం పార్టీ మనోగతాన్ని వెల్లడించారు. ఈ విషయం గ్రహించిన ఢిల్లీ పెద్దలు, ఇలా అయితే తెలుగు రాష్ట్రాలు కలిస్తే, తెలుగు వారి బలపడతారాణి భావించి, టీఆర్ఎస్, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు.
బీజేపీ పెద్దలు, రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని కేంద్రం తీరును దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం కంటే ముందు జరిగిన సమావేశాల్లో ప్రత్యెక హోదాకి కెసిఆర్ పూర్తి మద్దతు ఇచ్చారని, అవిశ్వాస తీర్మానం వచ్చే సరికి, దేశంలో అన్ని పార్టీలు సహకరించినా, తెరాస సహకరించలేదని గుర్తు చేసారు. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రాగానే, తెరాస మాట మార్చిందని, దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న బీజేపీతో ఎవరు ఉన్నా, మాకు శత్రువులే అని అన్నారు.
ఇదే సందర్భంలో, విష్ణుకుమార్ రాజుకు సీఎం సవాల్ విసిరారు. ‘‘తీర్మానాన్ని బలపరచడమే కాదు మీకు ధైర్యం ఉంటే.. ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. అలాచేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారని’’ అన్నారు. తాను చేసే పోరాటం స్వార్థం కోసం చేసేది కాదని, రాష్ట్ర ప్రజల హక్కుల కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని స్వాగతించాలని, సహకరించాలని.. అప్పుడే కేంద్రం దిగివస్తుందని సీఎం అన్నారు. తనకు ఎవరిపైనా కోపం, బాధ లేదని, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.