నీళ్లలో సర్.. ర్.. ర్ మంటూ దూసుకుపోయే ఎఫ్1 హెచ్2 పవర్ బోట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కృష్ణాతీరంలో నవంబరు 17, 18 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పర్యాటక శాఖ ద్వారా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తోంది. రోజుకు లక్ష మందికి పైగా స్వదేశీయులు, రెండు వేల మందికి పైగా విదేశీయులు మూడు రోజుల పాటు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టబోతున్నారు. ఎఫ్ 1 హెచ్ 2.. ఓ అంతర్జాతీయంగా హైస్పీడ్ బోటింగ్ రేస్‌లు నిర్వహించే సంస్థ. ఈ సంస్థ పవర్ బోట్, ఆక్వా రేసింగ్, వరల్డ్ నేషన్స్ కప్ పోటీలను నిర్వహిస్తుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ సంస్థ నేతృత్వంలో వరల్డ్ చాంపియన్ సిరీస్‌లు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం ఈ సంస్థ పది వరల్డ్ చాంపియన్ సిరీస్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పోర్చుగల్ (మే 18), లండన్(జూన్ 15 - 16 ), ఫ్రాన్స్(జూన్ 29 - జూలై 1 ) తేదీల్లో పోటీలను నిర్వహించారు. ఈ చాంపియన్‌షి్‌పలో భాగంగా పోర్చుగల్ గ్రాండ్‌ప్రీ, లండన్ గ్రాండ్‌ప్రీ, ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రీ పూర్తయ్యాయి. చైనా గ్రాండ్‌ప్రీ సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరుగుతుంది. ఆ తర్వాత అమరావతి వేదికగా ఇండియన్ గ్రాండ్‌ప్రీ నవంబరు 17, 18 తేదీల్లో జరుగనుంది. విజయవాడ భవానీ ఐల్యాండ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఐల్యాండ్ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వాటర్ స్టోరేజీ ఉండటం కలిసొచ్చింది. ఈ నీటిపై పవర్ బోట్లు నిమిషాల వ్యవధిలోనే దూసుకెళ్తాయి.
ఎఫ్1హెచ్2వోను విజయవంతం చేసేందుకు పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఏపీకి రప్పించేలా అనేక ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు స్థానికంగా ఉన్న యువతను ఆకర్షించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు వర్సిటీలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు ప్రారంభించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులే టార్గెట్‌గా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... పైగా వరల్డ్ చాంపియన్‌షిప్ కావడంతో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఏపీ భావిస్తోంది. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ఈ పోటీల నిమిత్తం విదేశీ పర్యాటకులు ఇక్కడికొస్తారు. కాబట్టి పర్యాటక శాఖ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ చాంపియన్‌షి్‌పను అమరావతిలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఒకవైపు ఎఫ్1హెచ్2వో ప్రపంచ చాంపియన్‌షిప్ ను నిర్వహిస్తూనే.. మరోవైపు అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను చాటేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు రచిస్తోంది.