రాష్ట్రానికి మరో సారి అరుదైన గౌరవం దక్కంది. కొన్ని రోజుల క్రితం, ‘ఆవాస యోగ్యమైన ప్రాంతాలు’ పేరుతో విడుదల చేసిన జాబితాలో మెట్రోనగరాలను వెనక్కి నెట్టి ఈ సారి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు స్థానాలు సంపాదించుకున్నాయి. అయితే, ఇప్పుడు మరోసారి తిరుపతి మళ్ళీ సత్తా చాటింది. దేశంలో భద్రత, రక్షణ ఉన్న నగరాల్లో తిరుపతికి రెండో స్థానం వచ్చింది. అంతేకాదు ఏపీ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో తిరుపతికి రెండో స్థానం చోటు దక్కింది. భద్రత, రక్షణ విషయంలో దేశంలోని 111 నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిశీలించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ తిరుపతికి రెండో స్థానం ప్రకటించింది.
ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహణ, హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు, భక్తులకు అత్యంత భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. భద్రత, రక్షణలో తిరుపతికి రెండోస్థానంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మరో పక్క ఈ ఘనత సాధించిన పోలీసు డిపార్టుమెంటుని ప్రశంసిస్తూ, పోలీసులకు అన్ని విధాలుగా సహకరించిన, తిరుపతి ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వెనుక ఆనాటి డీజీపీగా పని చేసిన నండూరి సాంబశివరావు గారి కృషి కూడా ఎంతో ఉంది.
ఇటీవల జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ 1గా నిలిచిన మన రాష్ట్రం, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోనూ దూసుకెళ్లింది. సుఖమయ జీవనానికి వీలు కల్పిస్తున్న నగరాల్లో మన రాష్ట్రానికి చెందిన నాలుగు సిటీలు ఎంపికయ్యాయి. అందులోనూ తొలి పది నగరాల్లో రెండు ఏపీవే కావడం విశేషం! ఈ నగరాల ఎంపికకు ప్రాతిపదికగా తీసుకొన్న నాలుగు సూచీల్లో తిరుపతి, విజయవాడ స్థానం పొందాయి. ఒక సూచీలో అయితే, తిరుపతి దేశంలోనే అత్యున్నత నగరంగా ఎంపిక అయింది. సంస్థాగతంలో రెండు, భౌగోళికంలో ఆరు, ఆర్థికంలో తిరుపతి 38వ ర్యాంకు పొందింది.