ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటమిపాలు కావటం తథ్యమని అంచనాలు చెబుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన తరువాత నాలుగు నెలలకు లోక్‌సభ ఎన్నికలు జరిపించటం ఆత్మహత్యాసదృశ్యమని బీజేపీ అధినాయకులు భావిస్తున్నారు.
జమిలి ఎన్నికల పేరుతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను లోక్‌సభ ఎన్నికల వరకు వాయిదా వేయాలని బీజేపీ అధినాయకత్వం మొదట భావించటం తెలిసిందే. లోక్‌సభతోపాటు పదకొండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల జరిపించటం ద్వారా మొదటి దశ జమిలి ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. జమిలీ కుదరదు అని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పటంతో, ఇప్పుడాయన నాలుగు రాష్ట్రాలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిపించాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, ఆ తరువాత వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరగవలసి ఉన్న లోక్‌సభ ఎన్నికల మధ్య సమన్వయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశంపై నరేంద్ర మోదీ పార్టీ సీనియర్ నాయకులు, వ్యూహకర్తలతో అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు ఒక సీనియర్ నాయకుడు వెల్లడించారు.
డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల శాసనసభలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిపించటం వలన ఆశించిన ఫలితాలను సాధించగలుగుతామా లేదా అని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. గతంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పడు ఇండియా షైనింగ్ పేరుతో లోక్‌సనకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలు కావడం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరగవలసిన లోక్‌సభ ఎన్నికలను ఆరు నెలల ముందు డిసెంబర్‌లో జరిపించుకోవటం ద్వారా విజయం సాధించగలుగుతామా అనేది బీజేపీ నాయకులను వేధిస్తున్న ప్రశ్న.