అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇదే జోరు కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని నగర నిర్మాణ పనులు అనతికాలంలోనే గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని, రాబోయే ఎనిమిది నెలల్లో పునాది స్థాయి దాటాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సచివాలయం, హెచ్‌వోడీ టవర్లను 2019 మే నాటికి 20 అంతస్తుల మేర కోర్ వాల్, 9 అంతస్థుల మేర డెస్క్ స్లాబ్ నిర్మాణాలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకోవాలన్నారు.
రాజధాని నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని, నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని ఏపీసీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో సీఎం స్పష్టం చేశారు. అమరావతి నగరం ప్రజల చేత, ప్రజల భాగ స్వామ్యంతో, ప్రజల కోసం నిర్మిస్తున్న రాజధాని నగరం అని పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతి రూపంగా ఆయన కొనియాడారు. నయాపైసా ఆశిం చకుండా రైతులు రూ. 50 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచ శ్రేణి రాజధాని కావాలన్న ప్రజల కోరిక సాధ్యమైనంత త్వరగా వాస్తవరూపం దాల్చాలంటే మనం నిరంతరాయంగా కష్టపడి పనిచేయాలన్నారు.
అంతకు మించి ప్రత్యామ్నాయం లేదన్నారు. సచివాలయం, హెచ్‌వోడీల టవర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన నాటి నుండి 29 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని నగర ప్రాంతంలోని ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం 86 శాతం మేర పూర్తయిందని చెప్పారు. ఎన్9 రోడ్డు 70 శాతం, ఇతర రోడ్లు 50 నుండి 60 శాతం మేర పూర్తయినట్లు అధికారులు వివరించారు. హౌసింగ్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని ఏడీసీఎల్ ఛైర్మన్ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కీలక అంశాలను స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీసీఆర్డీఏ శకటంలో ప్రదర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచిం చారు. యవాత్ ప్రపంచం అమరావతివైపు చూస్తోందని, పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మానుందని సీఎం పునరుద్ఘాటించారు.
ఇటీవల జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త ర్యుకోహిరా అమరావతిని సందర్శించారన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పారన్నారు. ఒక్క పట్టణ టౌన్‌షిప్‌ల రంగంలోనే 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టొచ్చని చెప్పారన్నారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నారైలు విమానాశ్రయాలకు కూడా వచ్చి అమరావతిలో పెట్టు బడులకు ఉన్న అవకాశాలపై ఆరా తీసినట్లు చంద్రబాబు తెలిపారు. దీన్ని బట్టిచూస్తే అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.