రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడంతో పాటు, ప్రతి పేదవాడికి రుచికరమైన, ఆరోగ్యకమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్స్కు అనూహ్య స్పందన లభిస్తుంది. అన్న క్యాంటీన్స్ పథకం ప్రారంభించి ఇప్పటికీ నెల రోజులు పూర్తి అయింది. గత నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్స్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల్లో దాదాపు 20 లక్షల మంది అన్న క్యాంటీన్స్‌లో భోజనాలు చేసినట్లు తెలుస్తోంది.రుచితో పాటు శుభ్రత ఉండటంతో అన్న క్యాంటీన్స్‌లో తినేందుకు రోజువారీ కూలీలు,కార్మికులు భారీగా వస్తున్నారు.
దీంతో ప్రారంభించిన నెలలోనే అన్న క్యాంటీన్స్కు భారీ స్పందన లభించింది. అలాగే అన్న క్యాంటీన్స్‌లో భోజనం నాణ్యతతో పాటు చుట్టుపక్కల పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది.క్యాంటీన్లలో కెమెరాలు ఏర్పాటు చేసి రియల్‌టైమ్‌లో ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఉన్న 63 క్యాంటీన్లలోనూ కలిపి రోజుకు సగటున సుమారు 65-70వేల మంది అల్పాహారం, భోజనం చేశారు. త్వరలోనే అన్న క్యాంటీన్ల సంఖ్య 100కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించినా... ఈ పథకానికి వచ్చిన స్పందనతో ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటుచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
రెండో దశలో 75 పట్టణాల్లో మరో 103 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రోజుకు 300-350మందికి అల్పాహారం, భోజనం అందించాలని తొలుత నిర్ణయించారు. అయితే అంతకుమించి ప్రజలు వస్తుండడంతో ఈ నెలరోజుల్లో సగటున 500 మందికి భోజనం పెట్టగలిగారు. అన్న క్యాంటీన్లలో ఉదయం 7.30నుంచి 10గంటల వరకు అల్పాహారం అందిస్తున్నారు. ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఇలా రోజుకు ఒక రకం పెడుతున్నారు. మధ్యాహ్నం 12.30నుంచి మూడు గంటల వరకు భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు పచ్చడి ఇందులో ఇస్తున్నారు. పచ్చడి అన్నం, పొంగల్ అన్నం మార్చి మార్చి అందిస్తున్నారు. పేద వాడికి అన్నం పెట్టే, ఇలాంటి పధకాన్ని కూడా, విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు అంటే, ఏమి చెప్పగలం.