"నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తూ ఉంటాడు" అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. అయితే, అందరికీ ముగ్గురు అని మాత్రమే తెలుసు కాని, జగన్ మాత్రం నలుగురు అని పదే పదే అన్నారు. అయితే, జగన్ వ్యాఖ్యల పై, పవన్ ఎప్పటికప్పుడు అవకాసం దొరికిన ప్రతిసారి స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా... పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో, మరో సారి, ""నలుగురు నలుగురు పెళ్ళాలు" అని జగన్ చేసిన వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. అంతే కాదు, అన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పారు.
పవన్ మాట్లాడుతూ, నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీలాగా నా జీవితాన్ని దాయను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి.. చీదరించుకుంటే చీదరించుకో నేను దాయను. నేను బయటకొకటి, లోపలొక మనిషిని కాదు, ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూరుగా తిరిగే వ్యక్తిని కాదు. నా కర్మ, నాకు కుదర్లేదు, ఇలా జరిగింది. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఏం చేయను దానికి’ అంటూ పవన్ అన్నారు. నా కర్మ... నాకు కుదరలేదు, అలా జరిగింది... ఏం చేయను? మంచో చెడో జరిగింది. నాకేం ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. వీడెప్పుడూ బయటివాళ్ల కోసం ఏడుస్తూ ఉంటాడు. వాళ్లకేమైంది, వీళ్లకేమైంది? అని బాధ పడుతుంటాడు. అలాంటి వారితో ఎవరుంటారు?
నాలాంటి వాడి పక్కన ఉండే వారికి సుఖం ఏముంటుంది? అందరూ నన్ను సినిమా యాక్టర్ అంటారు... కానీ నన్ను ఇంట్లో చూస్తే గదిలో ఓ మూలన పుస్తకాలు చదువుతూ కూర్చుంటాను. నా జీవితంలో పార్టీలు, పబ్బులు ఉండవు. ఎప్పుడూ కూర్చుని పుస్తకాలు చదువుతుంటాడు, లేకుంటే ఆవులు దగ్గరో గేదెల దగ్గరో ఉంటాను. లేదంటే ఎవరితోనే మాట్లాడుతూ ఉంటాను. నాతో ఉండే వారికి ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. అందుకే నా వ్యక్తి గత జీవితం చిన్నాభిన్నం అయిపోయింది. ఇలా అయినందుకు నేనూ ఏడ్చాను. ఆడ పడుచులు, అక్కా చెల్లెళ్లతో కలిసి పెరిగిన వాన్ని, అందరినీ ఎక్కువగా అర్థం చేసుకుంటాను.... కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరిగింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మరో పక్క, జనసేన పార్టీ గుర్తును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ గుర్తును పిడికిలిగా నిర్ణయించినట్లు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సభలో వెల్లడించారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని, అందుకే ఈ గుర్తును ఎంపిక చేశామని చెప్పారు. రేపటి నుంచి అందరూ పిడికిలి బిగించి, ఇది మా గుర్తు అని అందరికీ చెప్పాలని, మన గుర్తు, పిడికిలి అని చెప్పారు.