గన్నవరం ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయ్యి చాలా నెలలు అయ్యింది. అశోక్ గజపతి రాజు కేంద్రం మంత్రిగా ఉండటంతో, పనులు చకచకా జరిగాయి. మరి కొద్ది రోజుల్లో దుబాయ్ కి, సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవుతాయి అనుకుంటున్న టైంలో, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, తెలుగుదేశం మంత్రులు రాజీనామా చెయ్యటంతో, గన్నవరం కధ మొదటికి వచ్చింది. ఎంత మంది ప్రైవేటు ప్లేయర్స్ వచ్చి, మేము ఫ్లైట్ నడుపుతాం అన్నా పర్మిషన్ ఇవ్వలేదు. సింగపూర్‌కు ఇంటర్నేషనల్ చార్టర్డ్ ఫ్లైట్ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది.
దేశీయంగా చార్టర్డ్ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరిపారు అధికారులు. వెంకయ్య నాయుడుతో కూడా చెప్పించారు, చివరకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ఎట్టకేలక అనుమతి లభించింది. చార్టర్డ్ ఫ్లైట్ కాకుండా, మామూలు ఫ్లైట్ కే అనుమతి వచ్చింది. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు.
లోటు భర్తీ నిధి (వీజీఎఫ్) పద్ధతిలో సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దేశీయ విమాన సంస్థ ఇండిగో వారానికి రెండు నుంచి మూడు సార్లు సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు ముందుకురావడంతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) అనుమతించింది. ఈనెల 27 నుంచి సేవలు ప్రారంభించాలా? అక్టోబరు 2 నుంచి విమానాన్ని నడపాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 60 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడుసార్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడ (గన్నవరం)- సింగపూర్ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్, ఈమెయిల్ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. ఎట్టకేలకు సింగపూర్ ఫ్లైట్ రియాలిటీ అవ్వటంతో, ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఏ విధమైన కొర్రీలు పెట్టకుండా, ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నారు.