రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తొలినాడే హరివంశ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ చిన్న ఝలక్ ఇచ్చారు. ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి సర్కార్‌ను ఇరకాటంలో పడేశారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎక్కువ మంది విపక్ష సభ్యులు సభలో లేకపోవడం వల్ల ఓ ఇబ్బందికర పరిస్థితి నుంచి ప్రభుత్వం బయటపడగల్గింది. విషయమేంటంటే- ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్ ఉన్నవారు మిగిలిన రాష్ట్రాల్లో సైతం ఎస్సీ ఎస్టీలుగా ఆ సౌలభ్యం అనుభవించేట్లు రాజ్యాంగాన్ని సవరించాలని విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ అనే సమాజ్‌వాదీ సభ్యుడు ఓ ప్రైవేటు తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇది అసాధ్యమని, ఒక కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ అనే కేటగిరీల్లో చేర్చడానికి చాలా ప్రక్రియ జరుగుతుందని సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తిరస్కరించారు. అనంతరం దీనిపై ఓటింగ్ జరగాలని విపక్షాలు కోరగా ఉపాధ్యక్షుడు హరివంశ్‌సింగ్ అందుకు అనుమతి ఇచ్చారు. ఇది అన్యాయమని, ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతివ్వడం అసాధారణమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభ్యంతరం చెప్పారు. కానీ హరివంశ్ వినలేదు. ఒకసారి తాను రూలింగిచ్చేశాక వెనక్కి తీసుకోనన్నారు.
దాంతో ఆ తీర్మానాన్ని ఓడించడానికి ప్రభుత్వ విప్‌లు తమ పార్టీ సభ్యులను సభలోకి రప్పించడానికి పరుగులు పెట్టారు. చివరకు తీర్మానాన్ని 66-32 ఓట్ల తేడాతో సర్కారు ఓడించగల్గింది. విపక్ష సభ్యులు ఎక్కువమంది లేకపోవడం సర్కారుకు కలిసొచ్చింది. మరో పక్క, ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యల్లో కొన్నింటిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి తొలగించారు. ఏకంగా ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం పార్లమెంటు చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మొత్తానికి, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వరుస పెట్టి, కేంద్రానికి షాక్‌లు ఇస్తున్నారు.