రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు చివరి స్టేజి కు వచ్చాయి. తొలిదశలో 5 వేల క్యూసిక్కుల నీటిని ఎత్తిపోసేందుకు నిర్మాణం పూర్తి చేసారు. రెండో దశలో 7350 క్యూసిక్కుల వరద నీటిని పంపింగ్ చెయ్యటానికి పధకం నిర్మస్తారు. ఆగష్టు 15 నాటికి, ఈ పధకం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ తీసుకుంటున్న చర్యలు చివరి స్టేజికు వచ్చాయి.
సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది.
కలెక్షన్ పాయింట్.. కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్ పాయింట్ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఎస్కేప్ రెగ్యులేటర్.. సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్ రెగ్యులేటర్ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు.
పైౖపులతో అనుసంధానమే కీలకం.. డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్ట రోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేసారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు.. డెలివరీ సిస్టమ్... ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది.