అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ ఈ రోజు ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న జోన్లు విషయం పై , చేపట్టాల్సిన చర్యల పై ఆ లేఖలో పలు ఆదేశాలు ఇచ్చారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వివరించారు. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా జోన్లు విభజించామని తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వెల్లడించారు. కొత్తగా వచ్చిన లిస్టు ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి. ఆరెంజ్ జోన్లో 284, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు ఉన్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెడ్ జోన్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరంజ్ జోన్ లో ఏమి చెయ్యాలి, గ్రీన్ జోన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పై, పూర్తీ వివరాలతో లేఖ రాసారు. అలాగే ప్రతి చోట, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే, నడుచుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రెడ్‌జోన్ జిల్లాల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్ జోన్ జిల్లాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ ఉన్నాయి. గ్రీన్‌జోన్ జిల్లాల్లో కేవలం విజయనగరం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ రోజు విడుదలైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ చెప్పింది. కొత్త కేసులతో కలిపి ... మొత్తం సంఖ్య 1463కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.
గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. గత 24 గంటల్లో 7902 మంది నుంచి నమునాల సేకరించి పరీక్షలు చేయగా, వారిలో 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇక మే 3తో లాక్ డౌన్ ముగుస్తు ఉండటంతో, కేంద్రం ప్రభుత్వం తరువాత ఏమి చెయ్యాలి అనే దాని పై కసరత్తు చేస్తుంది. దీని పై రేపు ప్రధాని మాట్లాడే అవకాసం ఉంది.