రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన కచ్చితంగా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాలతో ఉన్నారు. అలా వస్తే.. వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు. పార్టీ పరంగా కసరత్తు కూడా ప్రారంభించారు. డిసెంబర్ అంటే.. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనేదే ఏపీ అధికార పార్టీ భావన. ఇటీవలి కాలంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను మూడు నెలల కిందటే ప్రారంభించారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. మరో పక్క, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని తెలుగుదేశం నాయకత్వం యోచిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముందస్తు ప్రకటనకు తొలి ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 30-40 మంది పేర్లనైనా మొదట ప్రకటించే వీలున్నట్లు తెలిసింది. సాధారణంగా నామినేషన్లకు కొంత ముందు టీడీపీలో అభ్యర్థుల ప్రకటన ఆనవాయితీ. ఈసారి కొంత ముందుగా ప్రకటిస్తే మంచిదని పార్టీ వర్గాల నుంచి వినతులు అందుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ముందుగా అభ్యర్థిని గుర్తిస్తే వారు నియోజకవర్గంపై పట్టు సాధించడం తేలికని పార్టీ వర్గాల వాదన.
మరో పక్క చంద్రబాబు సర్వే కూడా చేపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే నివేదిక అందాక, చంద్రబాబు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం కాబోతున్నారు. ఆ నివేదికలోని అంశాలను వారి ముందుంచుతారని సమాచారం. నివేదికలో ప్రతికూల రిపోర్టు వచ్చిన ఎమ్మెల్యేల చిట్టాను వారి ముందుంచి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి తుది హెచ్చరిక చేస్తారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఆ సమయం లోగా పని తీరును మెరుగుపరుచుకోలేకపోతే టికెట్‌పై ఆశలు వదులుకోలని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యే సరికి పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై చంద్రబాబు ఒక అంచనాకు వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.