19 ఏళ్ల తరువాత, టీమిండియాలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంట్రీ దొరికింది. ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగు, ఐదో టెస్టులకు హనుమ విహారి (24)ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. విహారితో పాటు 18 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ పృథ్వీ షాను సైతం ఎంపిక చేసింది. ఇంగ్లండ్ టూర్లో పూర్తిగా విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించి..వారి స్థానాల్లో యువ ప్లేయర్లను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. హనుమ విహారి స్వస్థలం..ఏపీలోని కాకినాడ. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టు నుంచి కెరీర్ ప్రారంభించిన విహారి..ప్రస్తుతం ఆంధ్రా జట్టుకు ఆడుతున్నాడు. 2010 నుంచి 2016 వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016-17 సీజన్లో ఆంధ్రా జట్టుకు మారిన తర్వాత విహారి కెరీర్ ఊపందుకుంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బ్యాట్‌తో సత్తాచాటిన విహారి 5142 పరుగులు చేశాడు. 15 సెంచరీలతో పాటు 22 అర్ధ సెంచరీలు సాధించాడు. 302 అత్యధిక స్కోరు. 2017-18 సీజన్లో మెరుగైన ప్రదర్శనతో టాప్-5లో నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 94 సగటుతో 752 పరుగులు చేయడంతో పాటు అతడి కెరీర్ బెస్ట్ ట్రిపుల్ సెంచరీ (302 నాటౌట్) సాధించాడు. క ఈ ఏడాది ఇరానీ కప్‌లో అతడు 183 పరుగులు సాధించాడు. 98 పరుగులకు ఆరు వికెట్లు పతనమైనదశలో జయంత్ యాదవ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజులో సుదీర్ఘంగా నిలదొక్కుకోవడం విహారికున్న ప్రత్యేక లక్షణం. చివరి ఐదు రంజీ సీజన్లలో 11 సెంచరీలు సాధించడం అతడి స్టామినాను తెలుపుతోంది.
ఆంధ్ర క్రికెట్ నుంచి భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రస్తుత జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చివరి ఆటగాడు. 1999లో న్యూజిలాండ్‌పై వికెట్ కీపర్‌గా అతడు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయిలో అంచనాలు పెంచిన ఆటగాడు ఇప్పటిదాకా లేడు. కానీ 19 ఏళ్ల ఎదురుచూపుల అనంతరం 24 ఏళ్ల హనుమ విహారి ఇప్పుడు టెస్టు జట్టులోకొచ్చేశాడు. అంచనాలకు తగ్గట్టుగానే కెప్టెన్‌గా, ఆటగాడిగానూ రాణించి ఏకంగా ఇప్పుడు టీమిండియా తలుపు తట్టాడు. అంతేకాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కానంత అత్యధిక సగటు (59.45) అతడిది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారాల సగటు సైతం 53 నుంచి 55 శాతమే కావడం గమనార్హం.