విశాఖ ఎంపీ కొత్తపల్లిగీత తన కొత్త రాజకీయపార్టీని ఈరోజే ప్రకటన చేయనున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. గీత గత ఎన్నికలలో వైసిపీ తరపున అరకు నుండి పోటీచేసి గెలుపొందారు. అయితే ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉండడంతో ఆమె టిడిపిలోకి జంపు చేస్తారనే ప్రచారం సాగింది. దానికి వైసిపీ క్రమశిక్షణ రాహిత్య చర్యలకు కూడా పూనుకోవాలని చూసింది. అయితే ఆమె తర్వాత టిడిపికి కూడా దూరంగానే ఉన్నారు. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం కూడా రాగా ఇప్పుడు ఏకంగా కొత్తపార్టీని పెట్టడానికి సన్నాహాలు చేశారు.
మహామహా యోధులే పార్టీలను పెట్టి, నడపలేక ఆపసోపాలు పడుతుంటే, కొత్తపల్లి గీత పార్టీ పెట్టటం ఆశ్చర్యం కలిగిస్తుందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ మొన్నటి దాక డబ్బులు లేవు అని చెప్పి, గత మూడు నెలల నుంచి మాత్రం డబ్బులు మంచినీళ్ళులా ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్ లో రెండు కొత్త ఆఫీస్ లు, విజయవాడ లో రెండు ఎకరాల్లో ఇల్లు, పార్టీ ఆఫీస్, రెండు చానల్స్, ఒక న్యూస్ పేపర్, ఇలా అన్నీ మూడు నెలల్లో సమకూరాయి. అయితే, పవన్ వెనుక ఉన్న జాతీయ పార్టీ ద్వారానే ఇవన్నీ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు కొత్తపల్లి గీత పార్టీ వెనుక కూడా ఆ జాతీయ పార్టీనే ఉందని అంటున్నారు. దానికి కారణాలు కూడా చెప్తున్నారు.
చంద్రబాబుని దించాలి అంటే, కేవలం కులాల వారిగా ప్రజలను విభజించి మాత్రమే అది సాధ్యమని ఆ జాతీయ పార్టీ నమ్ముతుంది. అందుకే జగన్, పవన్ ద్వారా కొన్ని సామాజకవర్గాలను టార్గెట్ చేసి, ఇప్పటికే పనిలో పడ్డారు. ఇప్పుడు కొత్తపల్లి గీత పార్టీ పెట్టి, ఆమెను బలోపేతం చేసి, అన్ని వానరులు ఇచ్చి, దళిత, గిరిజన సామాజిక వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసే ఆలోచన చేసింది ఆ జాతీయ పార్టీ. ఈ కొత్త పార్టీ 2-3 శాతం ఓట్లు, తెలుగుదేశానికి దూరం చేసినా చాలని వారి వ్యూహం. కర్ణాటకలో కూడా, ఆ జాతీయ పార్టీ ఇదే వ్యూహం అమలు చేసింది. అల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పేరుతో, నౌహేరా షేక్ అనే మైనార్టి మహిళ చేత పార్టీ స్థాపించి, 224 నియోజకవర్గాల్లో పోటీకి దింపి, దాదాపు ౩౦౦ కోట్లు ఖర్చు పెట్టి, ప్రధాన పార్టీల ఓట్లు చీల్చేలా చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కొత్తపల్లి గీతతో కూడా, అదే వ్యూహం మన రాష్ట్రంలో పారించాలని, చంద్రబాబుని ఓడించాలని చూస్తున్నారు.