కేంద్రప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ నిలదీశారు. కేంద్రప్రభుత్వ పీడీ ఎకౌంట్‌లపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును జవహర్ ప్రశ్నించారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ముందుగా కేంద్రంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ నిర్వహించకుండా రాష్ట్రాలపై విచారణ కోరడం అనైతికమన్నారు.
పీడీ ఎకౌంట్‌లు అధికంగా ఉండే రాజస్థాన్, మహారాష్టల్రోని బీజేపీ ప్రభుత్వాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదంటూ నిలదీశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి ఆరోపణలపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ధమ్ము, ధైర్యం ఉంటే ముందుగా కేంద్రప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ స్వీకరించాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టం హామీల అమలుకోసం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్మపోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే జీవీఎల్ ద్వారా మోదీ ప్రభుత్వం కల్పిత ఆరోపణలతో రాష్ట్రప్రభుత్వంపై దాడి చేయిస్తుందంటూ విమర్శించారు.
తన లాలూచీ మిత్రపక్షాన వైసీపీ, జనసేన ద్వారా తమ స్క్రిప్ట్‌తో రాష్ట్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కృషి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, రాజధాని అభివృద్ధిని కుంటుపర్చేందుకు మాయలేడి లాగా జీవీఎల్ నరసింహారావు వారానికి ఒకసారి రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై బండలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఏపీలో అడ్రస్ లేని జీవీఎల్ నరసింహారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మరో మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.