వామపక్ష పార్టీలు అసలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి.. మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే, 2009 తరువాత దాదాపుగా కనుమరుగు అయిపోయారు. ఇంకా కోలుకునే అవకాసం కూడా ఎక్కడ కనిపించటం లేదు. ఇలాంటి ప్రజలు తిరస్కరించిన పార్టీతో, కలిసి వెళ్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీరు అందరూ కలిసి, ముఖ్యమంత్రి అయిపోతాం అని చెప్తున్నారు. ఇది పక్కన పెడితే, పవన్ కి ఫ్యాన్స్ ఇమేజ్ వాడుకుని, మళ్ళీ బలపడాలని ఆరాట పడుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు. జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలోనే, వచ్చే ఎన్నికల్లో సీట్లు కోసం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో ఎలాంటి విధా నాలు అవలంభించాలి...?ఎన్ని సీట్లు కోరాలి..? ఏ విధంగా ఒత్తిడి పెంచాలి అనే అంశంపై రాష్ట్ర నాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఒక వేళ పవన్ ముఖ్యమంత్రి అయితే, మంత్రి పదవుల పై కూడా, ఇప్పటి నుంచే అవగాహన చేసుకోవాలని అనుకుంటున్నారు. 2014 నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సీట్లు కోరుకుని, సాధించి పోటీ చేయాలనే తపన కింద స్థాయి కేడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ‘జనసేనతో మనమేం చేయబోతున్నాం. ఎన్ని సీట్లు కేటాయిస్తామంటున్నారు. మనం కోరు కున్నది ఇస్తారా, ఇవ్వరా..? పరిస్థితి ఎలా ఉండ బోతుంది’ అంటూ నాయకత్వానికి ప్రశ్నల పరంపర ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేడర్ ఈ మేరకు అత్యంత ఉత్సాహంతో ఇలాంటి వాదనలకు పదునుపెట్టారు.
అయితే జనసేన వైఖరి ఎలా ఉండబోతుంది..జిల్లాకు ఇన్ని చొప్పున కేటాయింపులు ఉంటాయా, లేక రాష్ట్రం మొత్తం మీద కలిపి ఇన్ని సీట్లతో సరిపెట్టుకోవాలని తమ వైఖరిని త్వరలోనే ప్రకటించబోతున్నారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ సీపీఐ, సీపీఎంల వైఖరిలో మాత్రం ఒక స్పష్టత ఉంది. అదీ అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళాలనే స్థిర నిర్ణయానికి వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తాడో, వీళ్ళు ఎన్ని అడుగుతారో చూడాలి. అసలు పవన్ కళ్యాణ్ కే సీట్లు రావు అని సర్వేలు చెప్తుంటే, మధ్యలో వీళ్ళ హడావిడి ఏంటో మరి. చూద్దాం, ఏమి జరుగుతుందో, ప్రజలు ఏమని తీర్పు ఇస్తారో..