తెలంగాణ శాసనసభ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలపై శనివారం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన తెలంగాణశాఖ ముఖ్య నేతలు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వ్యూహాత్మక చర్చలు జరిపారు. రానున్న ఎన్నికలను ఎదుర్కొనే అంశంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సమన్వయ కమిటీ, జిల్లా కమిటీల నియామకాన్ని వెంటనే ప్రారంభిస్తామని, ఈ మొత్తం ప్రక్రియ రెండు, మూడు వారాల్లో పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.
కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చేసిన ప్రకటనలు ఈ సమావేశం దృష్టికి వచ్చాయని, అయితే ముందు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తంచేసే పనిలో నిమగ్నం అవుదామని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తెలంగాణ నేతలు పవన్ దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని వచ్చే సమావేశంలో చర్చిద్దామని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణలో జరుగుతున్న సభ్యత్వ నమోదు గురించి పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 15 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలని పవన్ సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జనసేన భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
శనివారం జరిగిన ప్యాక్ సమావేశంలో ముత్తా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కమిటీల నియామ కానికి జరుగుతున్న పనులపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో పార్టీకి చెందిన ఐటీనిపుణులు సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన ఐటీ నిపుణులే కాకుండా ఎన్‌ఆర్‌ఐలు కూడా సమావేశంలో పాల్గొంటారు. వేలాదిమంది సమావేశంలో పాల్గొనడానికి తమ సంసిద్దత తెలుపుతూ పార్టీ పరిపాలన కార్యాలయానికి వర్తమానం పంపుతున్నారని జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ తెలిపారు.