పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క కేంద్రం, మరో పక్క సొంత రాష్ట్రంలోని కొంత మంది, పక్క రాష్ట్రాలు, ఇలా అందరూ కలిసి ఆపటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, పోలవరం ఆపెయ్యాలి అంటూ, ఒరిస్సా ప్రభుత్వం, సుప్రీం కోర్టులో సుమారు 1500 పేజీల దస్తావేజులు దాఖలుచేసింది. ఈ నెల 2న సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమర్పించింది. 1970 జూన్‌లో రూపొందించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నివేదిక నుంచి ఈ ఏడాది ఆగస్టు 14న ఐఐటీ రూర్కీ సమర్పించిన హైడ్రాలిక్ తాత్కాలిక నివేదిక వరకు ఇందులో పొందుపరిచింది.
పోలవరం ప్రాజెక్టును సవాల్‌చేస్తూ తాను దాఖలుచేసిన నిజదావా (ఒరిజినల్ సూట్)లో తుది విచారణ ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు తాజాగా ఈ దస్తావేజులు సమర్పించింది. గోదావరి నదికి అడ్డంగా 1970 జూన్‌లో అప్పటి పశ్చిమగోదావరి జిల్లా పీడబ్ల్యుడీ విభాగం ప్రతిపాదించిన పోలవరం బ్యారేజీ స్కీం, 1978 మేలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యుసీకి సమర్పించిన పోలవరం డీపీఆర్, 1980 జులై 26న నోటిఫికేషన్ రూపంలో విడుదలైన గోదావరి ట్రైబ్యునల్ తీర్పు కాపీలను ఇందులో ఉంచింది. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనల దగ్గరనుంచి దాని నిర్మాణంలో ఇప్పటివరకూ చోటుచేసుకున్న సంఘటనల్నింటినీ గుదిగుచ్చి ప్రమాణపత్రం రూపంలో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసింది.
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. తాజాగా తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అభ్యంతరం తెల్పడంతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కావాలనే చేపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రభుత్వ లేవనెత్తుతుంది. ఒక పక్క కేంద్రం నుంచి వచ్చిన అన్ని కమిషన్లు, పనులు బాగా జరుగుతున్నాయని, పర్యావరణం, గిరిజనులకు ఇబ్బంది లేకుండా, వారికి కావలసినవి అన్నీ చేస్తున్నారని చెప్తున్నా, కేసులు మాత్రం వేస్తూనే ఉన్నారు. ఒక్క చోట అన్నా స్టే రాక పోతుందా అనే ఆశతో, ఒకరి తరువాత ఒకరు, ఎలాగైనా పోలవరం ప్రాజెక్ట్ ఆపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.