గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అజ్జంపూడి, అల్లాపురం, బుద్ధవరం, చినఅవుటపల్లి, కేసరపల్లి గ్రామాల్లో భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు సోమవారం తుళ్లూరు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో అమరావతి రాజధాని నగర పరిధిలో ప్లాట్ల కేటాయింపులు చేయడం జరిగింది. రైతుల సూచనలు, సలహాల మేరకు వారు కోరుకున్న విధంగా లేఅవుట్లు రూపొందించి పారదర్శకంగా లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రిపై నమ్మకంతో ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన రైతులు ఎంతో సహకరించారని ప్రశంసించారు.
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ ఎంతో కసరత్తు చేసి రైతులు కోరిన విధంగా ప్లాట్లను కేటాయించారని చెప్పారు. రాజధానిలో 27 వేల మంది రైతులకు 63 వేలకు పైగా ప్లాట్లను ఎలక్ట్రానిక్ విధానంలో పారదర్శకంగా కేటాయించామని ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. అదే రీతిలో గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారి ఆప్షన్ల ప్రకారం రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో సెమీ అర్బన్ ప్యాకేజీ కింద ప్లాట్లను కేటాయించామని కమిషనర్ చెప్పారు. ముందుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామని, 6 సార్లు రైతులు ఎమ్మెల్యేతో కలిసి తమ అభిప్రాయాలు తెలిపారన్నారు. రాజధాని అభివృద్ధి చూసేందుకు వీలుగా రెండు బస్సుల్లో గన్నవరం రైతుల పర్యటనకు చర్యలు తీసుకున్నామని, వారు అన్ని విషయాలు అవగాహన చేసుకుని , వారిచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు.
ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ఎంతో విశిష్టమైనదని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, మన అమరావతి యాప్‌ల గురించి రైతులకు తెలియజేశారు. వారం రోజుల తర్వాత రాజధాని పరిధిలో ఏర్పాటైన ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాల ద్వారా గన్నవరం రైతులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని, సంబంధిత రిజిస్ట్రేషన్ కేంద్రాల్లోని హెల్ప్ డెస్క్‌ల్లో ఉన్న తహశీల్దార్లకు తమ ఒరిజినల్ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు అందజేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భూములిచ్చిన రైతులకు తొలుత సోమవారం సాయంత్రం 4 గంటలకు తుళ్లూరు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిపారు. రెసిడెన్షియల్ ప్లాట్ల లాటరీ ట్రయల్ రన్ ను 4సార్లు, ఐదోసారి రెసిడెన్షియల్ ప్లాట్ల ఫైనల్ లాటరీని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ద్వారా తీయించి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు చేశారు.