తెలంగాణలో పొత్తులు ఉంటాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అక్కడి నాయకులు, కేడర్‌తో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుందామని వ్యాఖ్యానించారు. తెలంగాణతోపాటు జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై టీడీపీ దృష్టిసారించింది. దీనిపై చంద్రబాబు చర్చను ప్రారంభించారు. అందుబాటులో ఉన్న కొందరు మంత్రులు, ఎంపీలతో మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు ఆయన మేధోమథనం జరిపారు. మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, సుజయ్ కృష్ణ రంగారావు, లోకేశ్, ఎంపీలు రామ్మోహన నాయుడు, సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున టీడీపీ రాజకీయ వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరిగింది. ‘‘తెలంగాణలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవాలి. దానికి ఎటువంటి వ్యూహం అవసరమో ఆ ప్రకారమే వెళ్దాం’’ అని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. టీఆర్ఎస్, కాంగ్రె స్ పరిస్థితిపై మంత్రులు, ఎంపీలు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. నాయకులు వెళ్లిపోవడంతో కార్యకలాపాలు పెద్దగా లేవని, కానీ, తెలంగాణలో టీడీపీ ఓటింగ్ కొంతమేర నిలిచే ఉందని అభిప్రాయపడ్డారు.
‘‘టీఆర్ఎస్ రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నిర్ణయాలు.. రాజకీయ సంబంధాలు అదే కోణాన్ని సూచిస్తున్నాయి. టీఆర్ఎస్ బీజేపీకి దగ్గరైతే.. ఆ పార్టీకి టీడీపీ దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. టీఆర్‌ఎ్‌సతో అధికారికంగా పొత్తు ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అలా పొత్తు పెట్టుకొంటే టీఆర్ఎస్ మునిగి పోతుంది. పొత్తు లేకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ చులకన అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి’’ అని నాయకులు అన్నారు. దాంతో, ఎవరు ఏం చేస్తారో.. ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.