వైసిపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ ని, హిట్లర్ తో పోలుస్తూ ఒక కధ చెప్పారు. హిట్లర్ తన చేసే దుర్మార్గాలు కోసం గోబెల్స్‌ను పెట్టుకుంటే, ఈ తరంలో జగన్ తన అవినీతి పత్రిక సాక్షిని పెట్టుకున్నాడని అన్నారు. అబద్ధాలు, దుష్ప్రచారంలో సాక్షి గోబెల్స్‌ను మించిపోయిందని మండిపడ్డారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న మరునాడే గోబెల్స్ కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని.. 2019 ఎన్నికల తరువాత జగన్, ఆయన మీడియా రెండూ కనిపించవని యనమల అన్నారు. బీజేపీ పంచన చేరి జగన్ తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.
జాతీయ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో యథాలాపంగా చర్చించారని, దానికి చిలవలు పలవలుగా ప్రచారం చేయడం అతి హేయమని దుయ్యబట్టారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా జగన్, అతని మీడియా సాక్షి దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీలను ఏకం చేయగల శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని, ఇది ఇప్పటికే చరిత్రలో రుజువైందన్నారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ఏర్పాటు వెనుక కీలక భూమిక తెలుగుదేశందే అని యనమల గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. 2019లో అఖండ మెజారిటితో తెలుగుదేశం గెలుపు ఖాయమని, అది గ్రహించే జగన్ భయపడి తప్పుడు ప్రచారానికి తెగబడ్డారని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు.
భాజపా చుట్టూ, పీఎంవో చుట్టూ తిరిగింది జగన్ కాదా? తండ్రి శవం ఉండగానే సోనియా కాళ్లు పట్టుకుంది జగన్ కాదా? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ఇప్పుడు మళ్లీ భాజపా కాళ్లు పట్టుకోవడం నిజం కాదా? అంటూ నిలదీశారు. తెదేపాని విమర్శించే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు. రాష్ట్రం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్న యనమల.. రాష్ట్రం కోసమే ఎన్డీఏ నుంచి బైటకొచ్చి పోరాడుతున్నామన్నారు. జగన్ చంద్రబాబుకు ఆరు పెళ్లిళ్లు, పవన్ కళ్యాణ్‌కు నలుగురు పెళ్లాలు అంటూ.. ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, ఆయన మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కన్ను వేయాలని యనమల కోరారు.