తెలుగు రాష్ట్రాల గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి విజయవాడలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు.. అదీ ఎన్‌డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక తొలిసారి వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగడం గమనార్హం. చాలా రోజుల తర్వాత జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పాలనా వ్యవహారాలు, వర్షాల ప్రభావం తదితర పలు అంశాలు చర్చకు వచ్చాయి. గవర్నరు రాష్ట్ర పర్యటనకు వచ్చి విజయవాడలోని హోటల్‌లో బస చేశారు.
దీంతో ముఖ్యమంత్రి వెళ్లి ఆయనను కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశం తరువాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్లా. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై వివరించా. కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందీ తెలియజేశా. వరదలవల్ల గోదావరి జిల్లాలకు జరిగిన నష్టాన్ని, విహంగ వీక్షణంలో నేను పరిశీలించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలవల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని, పంట నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదిక పంపిస్తామని చెప్పా. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరా. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం చర్చకు రాలేదు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, మైనారిటీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో... ఆ విషయమూ గవర్నరుతో జరిగిన సమావేశంలో కచ్చితంగా చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం పంచాయితీలపైనా గవర్నర్ నరసింహాన్‌తో చంద్రబాబు చర్చించారు. మరో పక్క, బీజేపీతో జరుగుతున్న పోరాటం పై కూడా, గవర్నర్ కు స్పష్టం చేసారు. తమ రాజకీయ వ్యూహాలు, వైఖరిలో ఎలాంటి రహస్యం ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ నరసింహన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా కేంద్రంపైనా, బీజేపీపైనా తమ పోరాటం ఆగదని చెప్పినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో నరసింహన్‌తో చంద్రబాబు ఇంతసేపు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.