ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఐదోసారి ఎర్రకోట మీద మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయబోతున్నారు. ఈ టెర్మ్కు ఇదే ఆఖరిసారి. గతంలో ఎర్రకోట నుంచి ఆయన ఎన్నో నినాదాలు ఇచ్చారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి అయోగ్ తేవడం, ప్రతి గ్రామానికీ విద్యుత్ అనేవి ఎర్రకోట నుంచి ప్రకటించినవే. అయితే 2018లో ఆయన ఏం చేయబోతున్నారు? గత నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావిస్తారా? లేకపోతే ఎన్నికల ఎజెండానే మోదీ ప్రసంగంలో హైలైట్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.
పరిశీలకుల అంచనా ప్రకారం ఈసారి పథకాల ప్రకటన కంటే రాజకీయాల ప్రకటనలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా అయితే, రేపే మోడీ ఆ ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వ్యవసాయం, రైతులు, కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, రూపాయి పతనం, కులం పేరుతో దాడులు, నల్లధనం కట్టడి, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర వైఖరి, ఇలా అనేక చోట్ల కేంద్రం పై ప్రజలు కోపంగా ఉన్నారు. అయితే, ఇవేమీ రేపు మోడీ స్పీచ్ లో ఉండే అవకాసం కనిపించటం లేదు. ఈ సారి రెడ్ ఫోర్ట్ సాక్షిగా, రాజకీయ ప్రసంగమే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికలు సంవత్సరం, అదీ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ, మరిన్ని సంక్షేమ పధకాలు ప్రకటించే అవకాసం ఉందని అంటున్నారు. ప్రజాకర్షణ పధకాలతో, రేపు ప్రధాని ప్రకటనలు చేసే అవకాసం ఉంది. ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్న ప్రసంగంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకటించే అవకాశం ఉంది’ అని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. దేశంలోని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కింద సంవత్సరానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామాల్లో నివసించే 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 2.33 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిని పొందనున్నాయి. మొత్తానికి దేశంలోని 50 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు అందనున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఇవేమీ కాకుండా, మోడీ ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన ఏమన్నా చేస్తారా లేదా అన్న దాని పైనే, ఎక్కువగా ఫోకస్ పెట్టి చూస్తున్నారు.