ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు మెరుగైన ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.37.37 కోట్లతో బసవ తారకం మదర్ కిట్ ను అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బసవ తారకం మదర్ కిట్ ను ఉండవల్లి ప్రజావేదిక హాలులో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. సెప్టెంబర్ 26వ తేదీ 2016 నుండి ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 5 లక్షల 70 వేల 673 మందికి ఈ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కిట్ల వలన తల్లీ, పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరిందన్నారు.
ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ వలన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని, 2015-16 సంవత్సరంలో 42 శాతం ఉండగా, 2017-18 సంవత్సరానికి 45 శాతానికి పెరిగాయన్నారు. ప్రభుత్వం మాతా శిశువుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యల వలన శిశు మరణాల సంఖ్య 15 నుండి 11కు తగ్గిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతినెలా దాదాపు 30 వేల ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులలో జరుగుతున్నాయి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు మెరుగైన ఆరోగ్యం కొరకు ప్రభుత్వం రూ 37.37 కోట్లు ఖర్చు చేసి బసవ తారకం మదర్ కిట్లను 4.50 లక్షల తల్లులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క కిట్ విలువ రూ.1038 అని, ఈ కిట్లను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కిట్లలో బాలింత మహిళకు ఆరోగ్యపరంగా ఉపయోగపడే 5 వస్తువులు ఉంటాయన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ మాతృత్వ కానుకగా ఒక చీర, తల్లీబిడ్డలను చలిగాలి నుండి రక్షించేందుకు రెండు స్కార్ఫ్ లు, తల్లీబిడ్డలను వెచ్చగా ఉంచేందుకు ఒక బ్లాంకెట్, బాలింత వ్యక్తిగత పరిశుభ్రత కొరకు 40 శానిటరీ నాప్ కిన్స్ ఉంటాయన్నారు. ఆరోగ్య పరంగా బాలింత గోరువెచ్చని నీరు త్రాగాల్సిన అవసరం ఉన్నందున ఒక థర్మాస్ ఫ్లాస్క్ ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా బాలింతలలో ప్రసవానంతర ఆరోగ్యంపై అవగాహన కొరకు రూపొందించిన “తల్లి సంరక్షణ” కొరకు “బసవ తారకం మదర్ కిట్ పోస్టర్” ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.