జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను మంగళవారం భీమవరంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్లో 12 అంశాలను పొందుపరిచారు. అయితే, ఇవి పవన్ చెప్పిన సిద్ధాంతాలకు, పూర్తి భిన్నంగా ఉన్నాయి. మా పార్టీ ప్రధాన సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచనా విధానం అంటూ పవన్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు (ఆచరించారు అనుకోండి, అది వేరే విషయం). తెలుగుదేశం పార్టీ వివిధ కార్పొరేషన్ లు పెట్టి, వివిధ రిజర్వేషన్ లు పేరు మీద కులాలను విడదీస్తూ ఉంటుంది అంటూ, పవన్ కళ్యాణ్ ప్రతి రోజు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలాగే మరో 7 సిద్ధాంతాలు పార్టీకి ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
అయితే, ఆయన చెప్పే వాటికి, చేసే వాటికి పొంతనే లేదు. ఈ రోజు జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్లో, 12 హామీలు ఇస్తే, సగానికి పైగా హామీలు, కులాల మీదే ఉన్నాయి. అందరినీ కులాల పేరుతో విడదీస్తున్నారు అని చెప్పే పవన్, తను ఇచ్చే హామీలు అన్నీ, కులాల పేరు మీదే ఉన్నాయి. ఒకరిని అనే ముందు, మనం ఏమి చేస్తున్నాం అనేది కూడా చూడాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అని పవన్ పై ఉన్న అపవాదు, ఈ డాక్యుమెంట్ చుసిన తరువాత, మరింత బలపడుతుంది. పైగా, సరి కొత్త రాజకీయం అని చెప్పే పవన్, ఆ దిశగా ఎక్కడా తన విజన్ డాక్యుమెంట్ లో కనిపించలేదు. మరో పక్క "కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్ల కల్పన" అనే హామీ ఇప్పటికే తెలుగుదేశం అమలు చేసి, కేంద్రానికి పంపించింది. మరి పవన్ ఇంకా కొత్తగా చేసేది ఏంటో మరి... ఇవీ జనసేన ఇచ్చిన 12 హామీలు..
1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు 2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ 4. బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు 5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు 6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్ల కల్పన 7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం 8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్ 9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు 10. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు 11. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు 12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు