దేశమంతటా జమిలీ ఎన్నికలను నిర్వహించాలని కొంతకాలంగా గట్టిగా కోరుతున్న బీజేపీ.. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటే, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మాత్రం షాక్ ఇచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని భారత ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. జమిలి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్షా లా కమిషన్కు లేఖ రాసిన మరుసటి రోజే ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వచ్చే ఏడాది లోక్సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం పేర్కొంది. ‘‘ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సరిపడినన్ని వీవీపీఏటీలు మా వద్ద లేవు..’’ అని ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ పేర్కొన్నారు.
వీవీపీఏటీ మెషీన్ల కోసం సకాలంలో ఆర్డర్ చేయాల్సి ఉందనీ.. జమిలి ఎన్నికలపై రెండు మూడు నెలల్లోగా తుదినిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఇటీవల దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై నిన్న అమిత్షా లా కమిషన్కు లేఖ రాశారు. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఈ లేఖలో పేర్కొన్నారు. చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి రావడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎన్నికల కమిషన్ మాత్రం, మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసింది.
మరో పక్క, లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనకు తాము సుముఖమని, దీనివల్ల డబ్బు, సమయం, మానవ వనరులు ఆదా అవుతాయని, అభివృద్ధి ప్రక్రియ ఎలాంటి అంతరాయమూ లేకుండా కొనసాగుతుందని పేర్కొంటూ లా కమిషన్కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఓ లేఖ రాశారు. జమిలీపై అభిప్రాయ సేకరణకు కమిషన్ ఈ మధ్యే వివిధ పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హాజరుకాలేదు. బీజేపీ ఇప్పుడు తన సమ్మతిని తెలియజేయగా, కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లెఫ్ట్, తృణమూల్, ఎన్సీపీ, బీఎస్పీ, డీఎంకే, టీడీపీ లాంటి పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. అయితే బీజేపీ తన ప్రణాళికను ఎలాగైనా అమలు చెయ్యాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు కనబడుతోంది.