ప్రధాని మోడీ ఎప్పుడు చూసినా, ఎదో ఒక దేశం తిరుగుతూనే ఉంటారు.. దేశంలో ఉండేది తక్కువా, బయట తిరిగేది ఎక్కువ.. ఈ పర్యటనలను ఎగతాళి చేసే వారు ఉన్నారు, దేశం కోసం పాటుపడుతున్నారు అని సమర్ధించే వారు ఉన్నారు. అయితే, ఇవన్నీ కాదు, ప్రధని మోడీ విదేశీ పర్యటనల వెనుక మరో టార్గెట్ ఉందని, ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ప్రవాస భారతీయుల ఓట్లు టార్గెట్ చేస్తూ, మోడీ ఈ పర్యటనలు చేస్తున్నారని, ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తూ ఓ బిల్లును లోక్సభలో గత గురువారం ఆమోదించారు. దీని ఉద్దేశం విదేశాల్లో ఉన్న భారతీయులు పరోక్షంగా ఇక్కడ ఓటు వేసేందుకు వీలు కల్పించడం.
ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో ఏకంగా 84 దేశాల్లో పర్యటించారు. వీటికి అయిన మొత్తం ఖర్చు రూ. 1,484 కోట్లు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో తిరిగి రావడం అనవసరమని విపక్షాలు పదేపదే దాడిచేశాయి. కానీ ఆయన వ్యూహం వేరు.. వెళ్లిన ప్రతీచోటా భారత సంతతివారిని, ఎన్నారైలనూ కలవడం మోదీ షెడ్యూల్లో ఓ ముఖ్యాంశం. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఆయన సభలకు వచ్చేవారు. తన ఆలోచనలను, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వారితో పంచుకునేవారు. ఇలా వారితో ఓ మానసిక అనుబంధాన్ని ఆయన పెంచుకోగలిగారు. వివిధ దేశాల్లో సగటున కోటీ పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నట్లు ఓ అంచనా.
మొత్తం 543 నియోజకవర్గాలకూ విభజిస్తే వీరి సంఖ్య- ఒక్కో నియోజకవర్గానికి 21,000 మందిగా తేలుతుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. చాలా చోట్ల ఫలితాన్ని ప్రభావితం చేయగలదు. ఈ ప్రవాసులంతా వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తే అది బీజేపీకి ఎంత లాభం? అంతేకాదు.. ఈ ఎన్ఆర్ఐలు భారత్లోని తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. అది కూడా పార్టీకి లాభిస్తుంది. అందుకే వీళ్ల ఓట్లపై ప్రధాని మోదీ చాలాకాలం క్రితమే కన్నేశారు. వెళ్లిన ప్రతి దేశంలోనూ ప్రవాసీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేలాది మంది ఎన్నారైలలో జాతీయవాద అజెండాను బలంగా తీసుకెళ్లారు.
ప్రాక్సీ ఓటింగ్ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయించుకొనే) సౌకర్యం ఇన్నేళ్లూ కేవలం రక్షణ సిబ్బందికి మాత్రమే ఉండేది. ఎన్నారైలు ఇన్నాళ్లూ తాము ఓటరుగా రిజిస్టర్ చేయించుకున్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉండేది. ఇపుడు వారు తమ తరఫున ఓటు వేసే ప్రతినిధిని నియమించుకోవచ్చు. ఎన్నారైలను విశేషంగా ఆయన ఆకట్టుకున్నారని, వారి ఓట్లు బీజేపీ అభ్యర్థులకే పడతాయని పార్టీ నేతలంటున్నారు. మొత్తానికి, పోల్ మ్యానేజ్మెంట్ లో దిట్టగా మోడీ-షా లను ఎందుకు అభివర్ణిస్తారో ఇప్పుడు అర్ధమైంది. నియోజకవర్గానికి 21,000 మందిని టార్గెట్ చేసుకుని, వీళ్ళు చేసిన వ్యూహం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే...