రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల సాధన, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పై తెలుగుదేశం పార్టీ కర్నూలులో శనివారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని, ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ నేతగా హామీలను అమలు చేయాల్సిందేనన్న డిమాండ్ వీడియోలను వేదిక పై ప్రదర్శించారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా హామీ అమలు చేసి తీరుతామని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హామీ ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. నిన్న రాహుల్, జర్మనీ రాజధాని బెర్లిన్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి చంద్రబాబు కర్నూల్ సభలో స్పందించారు. విభజనను సహేతుక పద్దతుల్లో చేయకుండా చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిందని, దీనికి కారణం తెలుగోడి సత్తా ఏంటో వారు తెలుసుకోవడమేనని చంద్రబాబు ప్రకటించారు. తెలుగోడి సత్తా ఏంటో 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికి తెలిసివచ్చిందని అని అన్నారు.
రానున్న ఎన్నికల్లో కూడా తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో బీజేపీ, ఆ పార్టీకి అంటకాగుతున్న వైకాపా, జనసేనకు రుచి చూపాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలను ఇస్తే ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తామని, మనకు కావాల్సిన పనులు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేపించుకుందామని, దీనికి ప్రజల సహకారం కావాలని అన్నారు. "నాకోసం కాదు, ఎంపీల కోసం కాదు.. మన పిల్లల భవిష్యత్ కోసం, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం.. దెబ్బతీసిన వారికి గుణపాఠం చెప్పడానికి 25 ఎంపీలను గెలిపించుకోవడం చరిత్రాత్మక అవసరం. కసిగా పోరాడతాం. కర్నూలు పౌరుషానికి మారుపేరైన కొండారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో కేంద్రంపై పోరాడదామని" ప్రజలకు పిలుపిచ్చారు.