ప్రధాని నరేంద్ర మోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో మోదీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం మోదీ నేరుగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రజాధన్యవాద సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రధాని మోదీ తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు జగన్, నరసింహన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇది ఇలా ఉంటె, ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విమానంలో నుంచి మోడీ దిగిన తర్వాత ముందుగా గవర్నర్ నరసింహన్ ఓ పువ్వు ఉన్న బోకే ఇచ్చి మోదీకి స్వాగతం చెప్పారు. గవర్నర్ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఓ చిన్న పువ్వు ఉన్న బోకే ఇచ్చి వెల్కం చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని కాళ్లకు నమస్కారం పెట్టడానికి జగన్ ప్రయత్నించారు. అయితే, జగన్ చేతులు పట్టుకుని ఉన్న మోదీ వద్దని వారించారు. వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే జగన్ మరోసారి మోదీ కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా మోదీ.. జగన్‌ను వారించారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి .. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నాయకులను ప్రధానికి పరిచయం చేశారు. అయితే గతంలో చంద్రబాబు గౌరవంగా కొంచెం వంగితేనే గోల గోల చేసిన వైసిపీ, ఇప్పుడు ఏకంగా జగన్ మోడీ కాళ్ళ మొక్కుతుంటే, ఏమంటారో మరి. ఇది ఇలా ఉంటే, తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజాధన్యవాద సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మా వరకు ఎన్నికల అధ్యాయం ముగిసిపోయింది.
130 కోట్ల మందికి సేవ చేసే అధ్యాయం ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ రెడ్డికి శుభాకాంక్షలు. జగన్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. ఏపీ అభివృద్ధికి, ప్రజలకు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నా.’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో అంశాల్లో ముందుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు, ఇన్నొవేషన్ నుంచి స్టార్టప్స్ వరకు ఏపీ.. కొత్త మార్గంలో పయనిస్తుందని మోదీ అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే నవభారతం నిర్మాణం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు.