జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఊహించని షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రావెల హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తున్నారంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని తిరుమలకు రానున్నారు.
అయితే ఈ పర్యటనలో భాగంగా మోదీ సమక్షంలో రావెలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరనున్నారు. పార్టీలో చేరే నేతలకు ప్రధాని మోదీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించనున్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులు పడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దామంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపిచ్చిన రెండోరోజే ఆ పార్టీకి షాక్ తగిలింది. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న రావెల కిషోర్ బాబు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే రావెల.. బీజేపీలో చేరితే ముచ్చటగా మూడోపార్టీ తీర్థం పుచ్చుకున్నట్లవుతుంది. రావెల కిశోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేసి, ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెదేపాలో చేరారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన చంద్రబాబు హయాంలో కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి కోల్పోవడంతో తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. 2018లో తెదేపాకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జనసేనకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పవన్‌కు లేఖ పంపారు. రావెల ఈ సాయంత్రం భాజపాలో చేరనున్నారు.