జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో జగన్ నాయకత్వంలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. కొత్తదనం సృష్టించడంలో నవ్యాంధ్ర దిశగా అడుగులు వేయాలన్నారు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే నవభారత నిర్మాణం సాధ్యం అవుతుందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల అభివృద్ధిపైనే తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించినందుకు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తినమో వెంకటేశాయ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. శ్రీవారికి ప్రణామాలు చేశారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘నాకు అనేకసార్లు తిరుపతి వచ్చే అదృష్టం దక్కింది. రెండోసారి గెలిచిన తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చాను. శిరస్సు వంచి నమస్కరించి వెంకన్న ఆశీస్సులతో పాటు.. ప్రజల దనర్శనం కూడా చేసుకోగలుగుతున్నాను. శ్రీవారు 130 కోట్ల మంది భారతీయుల ఆశయాలను నెరవేర్చాలని కోరుతున్నాను’’ అని అన్నారు. కాగా, దీనికంటే ముందు.. సభకు వచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. సభకు ఆలస్యంగా వచ్చినందుకు తనను క్షమించాలని కోరారు. శ్రీలంక నుంచి రావడంలో ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలను అభినందిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇక్కడ గెలవకపోయినా ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం అని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కార్యదక్షతతో పనిచేస్తారని చెప్పారు. మున్సిపాలిటీల్లో గెలవని రోజుల్లోనూ అదే ఉత్సాహంతో పనిచేశామని గతాన్ని గుర్తుచేస్తూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ నేడు ఈ స్థాయికి రావడంలో కార్యకర్తల భాగస్వామ్యం అమోఘం అని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలు పంచుకోవడం బీజేపీ కర్తవ్యం అన్నారు. ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటామని, ప్రజల సంక్షేమంపై దృష్టి పెడతామని కార్యకర్తలనుద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో గెలవడం ఒకరోజే జరుగుతుందని, కానీ ప్రజల హృదయాలు గెలుచుకునేందుకు 365 రోజులు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, దేశ నిర్మాణానికి కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.