జనసేన పార్టీ రాబోయే కాలంల్లో, ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. 2019లో ఎన్నికల ఫలితాల్లో కేవలం ఒక్క సీటులో గెలిచిన తరువాత,పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలి అని విషయం పై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకు సంబంధించిన వివిధ కమిటీలు ఏర్పాటు చేసి, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కసరత్తు ప్రారంభించారు. ఇదే విషయం పై ఈ రోజు పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ సమావేశం అయ్యారు. దీని పై చర్చించిన తరువాత, పవన్ కళ్యాణ్ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో మాట్లడారు. జనసేన పార్టీ ముఖ్యమైన కమిటీల ఏర్పాటు పై ప్రకటన చేసారు. ప్రస్తుతం 18 నుంచి 20 కమిటీలు వేస్తున్నట్లు ప్రకటన చసారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా పార్టీ కోసం శ్రమించి, పార్టీని ముందుకు తీసుకువెళ్తామని, ప్రజల సమస్యల పై పోరాడతామని చెప్పారు.
ఇక ప్రస్తుతం, రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన ప్రజా వేదిక కూల్చటం పై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్రమకట్టడాలైతే ప్రజావేదికతో పాటు, కృష్ణా తీరం వెంట ఉన్న అన్ని అక్రమ కట్టడాలు కూల్చేయాలని జనసేన అధినేత అన్నారు. ఎదో ఒక బిల్డింగ్ కూల్చేసి, ఊరుకుంటాం అంటే అది కక్ష సాధింపు అవుతుందని, ఎలాగూ కూల్చటం మొదలు పెడుతున్నారు కాబట్టి, అన్నీ కూల్చేయాలి అని అన్నారు. మరో పక్క పార్టీ ఫిరాయింపుల పై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. సొంత ప్రయోజనాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారని అన్నారు. జనసేన పార్టీ నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఫిరాయింపులకు మా పార్టీ వ్యతిరేకమని అన్నారు. మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే నేతలను ఆహ్వానిస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తే స్వాగతిస్తామని అన్నారు. వెంటనే జగన్ ప్రభుత్వం పై విమర్శలు చెయ్యమని, వారి విధానాలు ఏమిటో చూస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.