రాష్ట్రంలో పలువురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు భద్రతను తగ్గించారు, మరి కొందరి మాజీలకు పూర్తిగా సెక్యూరిటీ తొలగించారు. కొత్తగా జగన్ ప్రభుత్వం కొలువుదీరడంతో, భద్రత సమీక్ష కమిటీ సిఫార్సులను పోలీసులు అమలు చేస్తున్నట్టు చెప్తున్నారు. నేతలకు ఉన్న స్థాయి, వారికి ఉన్న ముప్పును పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు. అయితే తాజా పోలీసులు తీసుకున్న నిర్ణయంతో కృష్ణా జిల్లాలోని పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్ మెన్ లను తొలగించగా, మరికొందరికి తగ్గించారు. ఇది రాజకీయ కక్షసాధింపుగా తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ, ఈ విషయం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, ఉప్పులేటి కల్పన, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, జలీల్ ఖాన్, మండలి బుద్ధప్రసాద్, తదితరులకు ప్రస్తుతం ఉన్న 1 + 1 గన్మెన్లను తొలగించారు. మరో పక్క విజయం సాధించినా గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తగ్గించారు. ఎమ్మెల్సీ అయిన బుద్దా వెంకన్నకు సగానికి తగ్గించారు. అలాగే, ఓటమి పాలైన తాజా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలకు మాత్రం తగ్గించి 1+1కు పరిమితం చేశారు.
అయితే వంశీ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. తనకు ప్రాణ హాని ఉందని భావిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా భద్రతను తగ్గించటం చర్చనీయంసం అయ్యింది. ప్రస్తుతం వంశీకి 2+2 ఉండగా, దానిని 1+1కు తగ్గించారు. అయితే తనకు మరింత భద్రత కావాలని, ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి డీజీపీ ఠాకూర్‌కు వంశీ లేఖ రాశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని జరిగిన సంఘటనలు అన్నీ చెప్తూ, 4+4 రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించారు. ఇది నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు వద్దకు రావటం, అన్నీ పరిశీలించి ఆయన కూడా సెక్యూరిటీ పెంచటానికి ఆమోద ముద్ర వేశారు. ఈ లోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో 4+4 ఉండాల్సిన భద్రత 1+1కు తగ్గించటం పై వంశీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచమని అడిగితే, ఇంకా తగ్గించడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వం కనుక స్పందించక పొతే, కోర్ట్ కు వెళ్లి సెక్యూరిటీ తెచ్చుకుంటామని అంటున్నారు.