పార్టీ ఫిరాయింపుల పై గతంలో అనేక సార్లు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంక్యనాయుడు, ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయించే ధోరణి చూస్తుంటే బాధ కలుగుతుందని, దీని పై చట్ట సవరణ చేసి, వెంటనే నిర్ణయాలు తీసుకునేలా చెయ్యాలని పదే పదే తన ఆవేదన వ్యక్తం చేసారు. అనేక సార్లు ఈ ఫిరాయింపుల పై రాజకీయాల్లో నైతికత గురించి వెంకయ్య మాట్లాడుతూ వచ్చారు. గెలిచిన పార్టీ నుంచి రాజీనామా చెయ్యకుండా, వేరే పార్టీలోకి వెళ్ళటం మంచి సంప్రదాయం కాదని, అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో, నిన్న నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్టీని ఫిరాయించి బీజేపీలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని 4వ పేరా ప్రకారం, మేము నలుగురు బీజేపీ పార్టీలో విలీనం అవుతున్నామని, సుజనా చౌదరి, గరికపాటి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ప్రకటించారు.
అయితే, పదో షెడ్యూలులో ఈ విలీనం గురించి రాజ్యాంగ నిపుణుల్లో భిన్న అభిప్రాయలు ఉన్నాయి. మూల పార్టీ విలీనం కావాలని నిర్ణయం తీసుకుంటే తప్ప, వేరే పార్టీలో విలీనం కుదరదని వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెంకయ్య ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో అనే సస్పెన్స్ నెలకొంది. అయితే వెంకయ్య మాత్రం, ఏ మాత్రం సంకొంచించకుండా, విలీన ప్రక్రియ పూర్తి చేసారు. తెలుగుదేశం పార్టీ విలీనం చేస్తునట్టు ఆ నలుగురు ఇచ్చిన లేఖ, ఆ వెంటనే విలీనం చేసుకుంటున్నామని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన లేఖ పరిగణలోకి తీసుకుని, బీజేపీలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు విలీనం అయినట్టు వెంకయ్య నాయుడు ఆమోద ముద్ర ఎసారు. దీంతో ఈ రోజు నుంచి సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు, రాజ్యసభ రికార్డుల్లో, బీజేపీ నేతలుగా పరిగనించబడతారు. అయితే, వెంకయ్య ఈ ప్రక్రియ ఒప్పుకోరు అంటూ నిన్నటి నుంచి వాదిస్తున్న కొంత మందికి మాత్రం, ఇది ఇబ్బందికర పరిణామం.