మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పై సామాన్య ప్రజలకు కూడా సందేహాలు ఉన్న విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన తరువాత, ఆ ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఫలితాలకు ముందు ఈ విషయం పై దేశ వ్యాప్త పోరాటం చేసారు కూడా. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, ఈ విషయం పై మాట్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎన్నో అవకతవకలు, పోలైన ఓట్లకు, ఫలితాలకు తేడా ఉన్నా, ఎవరూ సమాధానం చెప్పే వారు లేరు. ఈ నేపధ్యంలో, సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ పై హైకోర్ట్ ని ఆశ్రయించారు టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. తన నియోజకవర్గ పరిధిలో 16 ఈవీఎంలలో ఓట్ల తేడా పై వీవీ ప్యాట్స్ కౌంటింగ్ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు బోండా ఉమా... దీంతో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో బోండా ఉమాపై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మరో పక్క, తిరుపతి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచింది తానేనని.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మోసం చేసి గెలిచారని ఆరోపించారు. త్వరలోనే తానున కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని సుగుణమ్మ ఆరోపిస్తున్నారు. సాంకేతికంగా టీడీపీ ఓడినట్టు అధికారులు చెబుతున్నా.. నైతికంగా తానే గెలిచానన్నారు. 12వ రౌండ్‌లో టీడీపీకి 1700 ఓట్లతో మెజార్టీ ఉందని.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో తేడా జరిగిందరన్నారు. 700 ఓట్లకు పైగా పోస్టల్ బ్యాలెట్లను మార్చేశారని ఆరోపించారు. 11 రౌండ్ల వరకు టీడీపీ 3100 ఓట్ల ఆధిక్యతలో ఉందట.. 12వ రౌండ్‌లో 1336 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో నిలిచిందట. 13రౌండ్‌లో 2045 ఓట్లు వైసీపీకి ఆధిక్యత రాగా.. రెండు రౌండ్లు కలిపితే 3381 ఓట్లు కరుణాకరరెడ్డికి రావడంతో 3100 ఓట్ల ఆధిక్యతలో ఉన్న సుగుణ 281 ఓట్లతో వెనుకబడ్డారట.
ఇక 14వ రౌండ్‌లో ఎల్‌ఎస్ 726 ఓట్లున్న ఒకే ఈవీఎం ఉండగా.. టీడీపీ తమకు అనుకూలంగా వస్తాయన్న భావించిందట. కానీ టీడీపీకి 46 ఓట్లు మాత్రమే ఆధిక్యత రాగా.. అప్పటికీ 235 ఓట్లతో వైసీపీ ఆధిక్యంలో ఉంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా.. వైసీపీకి 1167 ఓట్లు, టీడీపీకి 691 ఓట్లు రావడంతో ఫ్యాన్ పార్టీని విజయం వరించింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని సుగుణమ్మ ఆరోపిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో 2800 పోస్టల్ బ్యాలెట్లున్నాయి.. వీటిలో 2508 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయన్నారు సుగుణమ్మ. వీటిలో 308 కవర్లను ఓపెన్ చేయకుండా డస్ట్‌బిన్‌లో పడేశారని.. వీటిని ఎందుకు అనర్హతగా ప్రకటించారని అడిగితే పట్టించుకోలేదన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో ఓపెన్ చేసిన వాటిలో టీడీపీకి వచ్చిన 175 పోస్టల్ బ్యాలెట్లు డబుల్ టిక్‌లు ఉన్నాయని.. ఉద్యోగులు డబుల్ టిక్‌లు ఎందుకు పెడుతారని అధికారుల్ని ప్రశ్నించినా పట్టించుకోలేదన్నారు. ఎంపీ అభ్యర్థికి వచ్చిన 200 పోస్టల్ బ్యాలెట్ ఓటులో తమకు రాలేదన్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఇద్దరు నేతల పోరాటం చూసి, ఇంకా ఎంత మంది నేతలు బయటకు వస్తారో చూడాలి. వచ్చినా వారికి న్యాయం జరుగుతుందా, ఏదైనా కుట్ర జరిగి ఉంటే, అది బయటపడుతుండా, కాలమే వీటికి సమాధానం చెప్పాలి.