ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని సీఎం జగన్ ఘాటుగా విమర్శించారు. అయితే ఇదే పని చేసిన, చేస్తున్న కేసిఆర్ తో మాత్రం, జగన్ చట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్న సంగతి ప్రజలు అందరూ చూస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే పదే పదే చంద్రబాబు 23 మందిని కొనేసాడు అంటూ జగన్ అతని బృందం చంద్రబాబుని టార్గెట్ చేసింది. నిజానికి గవర్నర్ బంగళా ముందు నుంచుని నాతో టచ్ లో 23 మంది ఉన్నారు, గంటలో నీ ప్రభుత్వం పడగొడతా అంటే, చంద్రబాబు అప్పుడు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
అవేమి ప్రస్తావించని జగన్, కేవలం చంద్రబాబు కొనేసాడు కొనేసాడు అంటూ అసెంబ్లీలో చంద్రబాబుని టార్గెట్ చేసారు. అంబటి రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి లాంటి ఉద్దండులు కూడా చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో చంద్రబాబు మైక్ అందుకున్నారు. తొలి ప్రసంగంలోనే జగన్ ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ‘‘సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగురోజుల్లోనే పార్టీ మారారు. అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తిగారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి. తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్నవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి."
"అధికార పక్షం సంప్రదాయాలు పాటించకపోయినా మేము పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా. ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తే బాగుండేది. గతంలో స్పీకర్‌ను ఎంపిక చేశాక మంత్రులను జగన్ వద్దకు పంపించి నామినేషన్లు వేయించా. కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వాళ్లు కూడా సంతకాలు చేశారు. స్పీకర్ ఎన్నికపై కనీసం ఒక్కమాట అయినా చెబుతారని ఎదురుచూశా’’ అని చంద్రబాబు వివరించారు. అయితే దీనికి సమాధానం చెప్పలేని జగన్, అప్పుడు చరిత్ర ఎందుకుయ్యా, నువ్వు మామని వెన్నుపోటు పొడిచావ్ అంటూ, చంద్రబాబు అడిగినదానికి సమాధానం చెప్పలేక, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. ఫిరాయింపులు ఈ రాష్ట్రంలో మొదలు పెట్టింది ఎవరో జగన్ గారి కొత్త స్నేహితుడు, కేసిఆర్ గారికి బాగా తెలుసు. ఈసారి కలిసినప్పుడు ఒకసారి అడిగితే వారు కరెక్ట్ గా చెప్తారు.