తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా అమలులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల పేర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులుగా ఆగమేఘాలపై మారిపోతున్నాయి. ఇదే సమయంలో కోటీ 50లక్షల కుటుంబాలు ప్రతి నెలా నిత్యావసర సరుకులు తీసుకునే రేషన్ కార్డుల రంగులు కూడా మారతాయని అంటున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కోన శశిధర్ రేషన్ కార్డుల మార్పునకు సంబంధించిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే రేషన్ కార్డు రంగు, దీనిపై ఉండాల్సిన చిహ్నాలు, ఫొటోలు, తదితర అంశాలన్నింటినీ పొందుపరచి ఐదు రకాల కార్డు నమూనాలను కమిషనర్‌కు అందించినట్లు తెలిసింది. కమిషనర్ శశిధర్ వాటిని పరిశీలించి రేపోమాపో తన ప్రతిపాదనలను ముఖ్య కార్యదర్శికి అందించనున్నారు.
అయితే ఈ లోప మంత్రివర్గం ఏర్పడటం, కొడాలి నాని సంబధిత శాఖకు మంత్రి అవ్వటంతో, ఇప్పుడు ఈ విషయం ఆయన వద్దకు వెళ్ళింది. అన్నీ ఒకే అయితే, కొడాలి నాని చేసే మొదటి పని ఇదే అని అంటున్నారు. రంగు మార్చి, వైసిపీ రంగు కార్డులు పెడతారా, ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇక పాత కార్డులను రంగు సహా మార్చడానికే పరిమితం అవుతారా? లేక అర్హులకు కొత్త కార్డులు అందచేస్తారా? అనే దానిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోటీ 43లక్షల 81వేల 896 రేషన్ కార్డులు చలామణిలో ఉన్నాయి. గత జనవరిలో జరిగిన జిల్లా కలెక్టర్ల చివరి సదస్సు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం 53,901 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో 6,777 దరఖాస్తులను తిరస్కరించారు. ఇక మిగిలిన వాటిపై కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.