పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలు, కొత్త ప్రభుత్వం నిర్ణయాలపై చర్చించారు. ‘ఒక్కసారి జగన్‌కు అవకాశం’ అనే నినాదం బాగా పనిచేసిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, సంక్షేమ విషయాల్లో అసంతృప్తి కనబడలేదని చంద్రబాబుతో నేతలు చెప్పుకొచ్చారు. 1989, 2004 ఎన్నికల సమయంలో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, ఈసారి ఆ వ్యతిరేకత లేకపోయినా పార్టీ ఓడిపోయిందన్నారు. సామాజిక సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఈ ఎన్నికల్లో పనిచేశాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సీఎం జగన్ 10 రోజుల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
తమ హయాంలో ప్రారంభమైన పనులను పక్కన పెట్టేందుకే కొత్త ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలు చేస్తోందని నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలపై అవినీతి ముద్ర వేయడానికే టెండర్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గత ప్రభుత్వానికి ఇరిగేషన్ క్రెడిట్ దక్కకూడదనే వ్యూహం కూడా ఆ నిర్ణయం వెనుక ఉందన్నారు. తన సొంత పథకాల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షంగా ఎక్కువ కాలం మౌనంగా ఉండటం కూడా మంచిది కాదని పలువురు నేతలు తమ అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు ముందు వెలిబుచ్చారు.
ఇదే సమయంలో స్పందించిన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలపై దాడుల విషయంలో నేతలు అండగా నిలవాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరగడం, నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడి, నరసరావుపేట, రేపల్లె, గురజాల, అనంతపురం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలను ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించగా.. వీటికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని తెప్పించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలని, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆ బేటీలోనే నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు.