మన రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్ నియమితులయ్యారంటూ మీడియాలో ఓ వార్త తెగ హల్‌చల్ చేసింది. నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోమవారం దేశ రాజధానిలో సుష్మాస్వరాజ్ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలుసుకోవడం, దాదాపు అదే సమయంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ కావడంతో ఈ వార్త పుట్టుకొచ్చింది. దావానలంలా వ్యాపించింది. ఏపీకి కొత్త గవర్నర్ ఖాయమయ్యారనే వార్తలు ఊపందుకున్నాయి. జోరుగా చక్కర్లు కొట్టాయి. చివరికి- సుష్మా స్వరాజ్ స్వయంగా ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా అసత్యం అంటూ ఆమె వివరణ ఇచ్చుకునేంత వరకు వెళ్లిందీ పరిస్థితి.
ఏపీకి కొత్త గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ నియమితులయ్యారనే వార్తను పుట్టించిందెవరో తెలుస్తే ఆశ్చర్యపోతారు. ఈ వార్తను పుట్టించింది స్వయంగా కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ఈ వార్త పుట్టుకుని రావడానికి ఆయనే కారణం. ఆయన చేసిన ఓ ట్వీట్.. ఈ వార్తకు కారణమైంది. బీజేపీ నాయకురాలు, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఏపీకి కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.. అనేది దీని సారాంశం. అప్పటికే చెలరేగుతున్న ఊహాగానాలు, అనుమానాలకు ఈ ట్వీట్ మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. అది తప్పుడు సమాచారం అని ఆయనకు తరువాత తెలిసినట్టుంది. ఆ ట్వీట్‌ను డిలెట్ చేసేశారు. ఈ వ్యవహారం మొత్తానికీ కేంద్రబిందువైన సుష్మాస్వరాజ్ కూడా దీనిపై స్పందించారు. తానేదో మర్యాదపూరకంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశానని, అంత మాత్రాన తనను ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా చేసేశారని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. కేంద్రమంత్రి బాధ్యతల నుంచి వైదొలగిన తరువాత కాస్త ఖాళీ సమయం దొరకడంతో తాను వెంకయ్య నాయుడిని కలుసుకున్నానని చెప్పుకొచ్చారు. అంత మాత్రానికే ట్విట్టర్ తనను గవర్నర్‌గా నియమించిందంటూ ట్వీట్ చేశారు.