చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్దగా ఏమి ఇవ్వలేదు కేంద్రం. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నా, వాటికి అరకోర కేటాయింపులు చేస్తూ వచ్చింది. ఇవన్నీ మూడేళ్ళు చూసిన చంద్రబాబు, బీజేపీతో ఖటీఫ్ కొట్టి, రాజకీయంగా ఎంతో నష్టపోయే నిర్ణయం తీసుకుని, రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. బలమైన మోడీ, షా లకు, రాష్ట్రం కోసం ఎదురు తిరిగి, రాజకీయంగా ఎంత నష్టపోయారో మొన్న ఎన్నికలు చెప్పాయి. అదే సమయంలో, అప్పట్లో ఢిల్లీ నుంచి ఏమి సాధించ లేకపోయారు అని హేళన చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కేంద్రం మెడలు వంచి అన్నీ సాదిస్తామని చెప్పారు. అందుకే ప్రజలు 22 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. అయితే ఈ రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. జగన్, విజయసాయి రెడ్డికి, మోడీతో ఉన్న దగ్గర సంబంధాలు చూసి, అబ్బో ఇక ఏపికి నిధుల వరద పారుతుందని అందరూ అనుకున్నారు. విజయ్ గారు అని మోడీ ప్రత్యేకంగా పలకరించటం చూసి, వీళ్ళు చుట్టాల కంటే ఎక్కువ దగ్గరయ్యపోయారు, ఇదంతా ఏపికి మంచి జరగటానికి సంకేతాలు అని ప్రజలు భావించారు.
అయితే ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో, మళ్ళీ ఏపికి పాత ట్రీట్మెంటే ఇచ్చింది కేంద్రం. విభజన హామీల ప్రస్తావన లేదు, అమరావతి నిర్మాణం గురించి, పోలవరం గురించి అసలు ఒక్క మాట కూడా లేదు. లోటు బడ్జెట్ తో అల్లాడుతున్న రాష్ట్రం, ఎన్నో విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి, అవాన్నీ జగన్ సాధిస్తారు అని ప్రచారం చేసిన వైసీపీ, మరి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తుందో ? లేకపోతె సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని ప్రజలను కూడా అనమంటుందో. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ బడ్జెట్ లో మనకు వచ్చిన కేటాయింపులు, సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ. 8కోట్లు మాత్రమే. ఇక మిగతా విద్యాసంస్థలు అయిన ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు మాత్రం ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు.