ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రశాంతతకు మారు పేరు. గత 5 ఏళ్ళుగా రాయలసీమ కూడా ప్రశాంతంగా ఉండటంతో, అక్కడకు కూడా కంపెనీలు వస్తున్నాయి. అనంతపురంలో కియా, కర్నూల్ లో సీడ్ ప్లాంట్, కడపలో సోలార్ ప్లాంట్ ఇలా అనేక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మళ్ళీ రాయలసీమలో టెన్షన్ వాతావరణం వచ్చేసింది. తాజాగా కడప జిల్లా మైలవరం మండలలోని రామచంద్రాయపల్లె సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్ లో, గుర్తు తెలియని వ్యక్తులు, దాదపుగా 1,700కు పైగా సోలార్ ప్యానెల్స్ నాశనం చేసారు. ఈ చర్యతో కంపెనీని రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. సోలార్ కంపెనీ ఉన్న 16వ ప్లాంటులో ఈ ఘటన చేసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సోమవారం ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది అధికారులకు తెలిపారు. దీంతో కంపెనీ ఉదయ్, దస్తగిరిరెడ్డి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జమ్మలమడుగు రూరల్ సీఐ మంజునాధ రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని సోలార్ ప్యానెల్స్ ధ్వంసం చేసిన విధానం పరిశీలించారు. కంపెనీ సిబ్బందిని అడిగి, వివరాలు రాబట్టారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ లో 250 మెగావాట్ల సామర్థ్యంతో, సోలార్ ప్లాంట్ రెడీ అవుతుంది. దీనికి సంబందించిన పనులు, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు జరిగాయి. ఆదివారం రాత్రి ఈ ప్యానెల్స్ ను ధ్వంసం చేసారు. జరిగిన విధానం చూస్తే, 1,700లకు పైగా సోలార్ ప్యానెల్స్ ను గొడ్డలి లాంటి ఆయుధాలతో ధ్వంసం చేసినట్లు అర్ధమవుతుంది. ఈ చర్యతో దాదాపు మూడు కోట్ల మేర నష్టం జరిగిందని, ఇది కంపెనీకి చాలా నష్టం అని, ఇలా జరిగితే, మేము ఇక్కడ నుంచి ప్లాంట్ ఎత్తేయటమే అని కంపెనీ సిబ్బంది వాపోతున్నారు. అయితే ఈ గుర్తు తెలియని దుండగలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు సరైన దర్యాప్తు చేస్తే, వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది.