తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మొదటిసారి గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు నుంచి వారంలో 5 రోజులు పాటు, చంద్రబాబు ఇక్కడే, కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండనున్నారు. చంద్రబాబు మొదటి సారి కార్యాలయానికి వచ్చిన సందర్భంలో, పెద్ద ఎత్తున, నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యాలయం బయట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, చంద్రబాబు కార్యాలయంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా, చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచే జరుగుతాయాని అన్నారు. మంగళగిరిలో కార్యాలయం సిద్ధం అయ్యే వరకు, ఇక్కడ నుంచే పని చేస్తామని చెప్పారు. 40 శాతం మంది మనకు ఓటు వేసారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనదే అని చంద్రబాబు అన్నారు. ఎంతో మంచి పరిపాలన అందించామని, అందరికీ సంక్షేమ పధకాలు అందించామని, ఏ మూలకు వెళ్ళినా మన అభివృద్ధి కనిపిస్తుందని, అయినా ఎన్నికల్లో ఓడిపోయామని, గెలుపు ఓటములు సహజం అని, ప్రజల కోసం పని చెయ్యాలని చంద్రబాబు అన్నారు.
అయితే ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్న దాడులు పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ వచ్చిన నెలలోనే మన కార్యకర్తల పై దాడులు జరిగాయని అన్నారు. ఇప్పటికే 6 గురుని చంపేశారని అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండాల్సిన బాధ్యత నాదని, అవసరం అయితే ఆ గ్రామాలకు వచ్చి అండగా ఉంటానని అన్నారు. కుప్పం పర్యటన తరువాత, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలని చంద్రబాబు పరామర్శించనున్నారు. చనిపోయిన వారికి 5 లక్షలు ఆర్ధిక సాయం చెయ్యనున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తలే 37 ఏళ్ళుగా పార్టీని మోస్తున్నారని, పార్టీ వల్ల నష్టం వచ్చినా పార్టీతోనే ఉన్నారని అన్నారు. వారే మన పార్టీకి మూలస్తంభాలు, అలాంటి వారి పై దాడులు చేస్తే, చూస్తూ ఊరుకోను, మనం ఏ తప్పు చెయ్యలేదు, అరాచకం చెయ్యలేదు, మీకు అండగా నేను ఉంటా, మీ ఊరికి వచ్చి అండగా ఉంటా అని చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.