ఎన్నికల ఫలితాలు తరువాత, రాష్ట్ర ప్రభుత్వం, తనకు భద్రత తగ్గించటం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న హైకోర్ట్ లో పిటీషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు. మావోయిస్టుల నుంచి, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చంద్రబాబుకు, ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ కోణంలో భద్రతని తగ్గించారని న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు. గతంలో చంద్రబాబు పై అలిపిరిలో జరిగిన దాడి గురించి ఈ సందర్భంగా కోర్ట్ కు విన్నవించారు. తెలుగుదేశం అధినేతతో పాటు ఆయన కుటుంబానికీ భద్రత తగ్గించారన్న విషయాన్ని హైకోర్ట్ దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఎర్ర చందనం స్మగ్లర్ల పై ఉక్కుపాదం మోపారని, అప్పటి నుంచి వారు చంద్రబాబు పై కక్షకట్టి ఉన్నారని,ఆ స్మగ్లర్ల నుంచి కూడా చంద్రబాబుకు ప్రాణ హాని ఉండనే విషయాన్ని గుర్తు చేసారు.
దీని పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబుకు మేము ఎక్కడ భద్రత తగ్గించలేదని, ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్ట్ కు వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దాని కంటే, చాలా ఎక్కువ భద్రత ఇస్తున్నమంటూ, సమాధానం చెప్పారు. చంద్రబాబుకి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, కేవలం 58 మందితోనే భద్రత ఇవ్వాల్సి ఉన్నా, మా ప్రభుత్వం 74 మందిని ఇచ్చిందని కోర్ట్ కు చెప్పారు. అయితే చంద్రబాబుకు ఇతర మాజీలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉందని, ఆయన జెడ్ + భద్రతలో ఉన్నారని, 2014కి ముందు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏ భద్రత అయితే ఉండేదో, అదే భద్రత ఇవ్వాలని చంద్రబాబు తరుపున న్యాయవాది కోరారు. దీని పై కోర్ట్ స్పందిస్తూ, ప్రభుత్వనికి అన్ని వివరాలు ఇవ్వాలని కోరింది. చంద్రబాబుకు ఎంతమందిని, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నారో అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ కోరింది. ఈ కేసు పై తీర్పును, ఈ నెల 9వ తేదికి వాయిదా వేసింది.