తెలుగుదేశం పార్టీ, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు అంటూ, ప్రచారం జోరుగా సాగింది. నాలుగు, అయుదు గంటలుగా ప్రచారం జరుగుతున్నా, అనగాని ఈ విషయం పై స్పందించక పోవటంతో, అందరూ నిజమే అని అనుకున్నారు. ఈ రోజు ఆయన గరికిపాటిని కలవటంతో, ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన అమిత్ షా ని కలిసారని, బీజేపీలో చేరిపోయారని, కొద్ది సేపటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారం పై మీడియా ముందుకు వచ్చారు అనగాని. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజంలేదని అనగాని సత్యప్రసాద్ అన్నారు. తాను వ్యక్తిగత పని మీద ఢిల్లీ వచ్చానని చెప్పారు. ఈ విషయం తమ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పే ఢిల్లీ వచ్చానని ఆయన స్పష్టం చేశారు. గరికపాటిని కలవటం పై స్పందిస్తూ, గరికపాటి తమ కుటుంబానికి మొదటి నుంచి మంచి మిత్రుడని, ఆయన గత వారం రోజులుగా ఒంట్లో బాగోలేదు అని తెలియటంతో, ఆయన్నికలిసేందుకు వచ్చానని చెప్పారు.
తాను అమిత్‌షాను కలిసినట్టు వస్తున్న వార్తలతో నిజం లేదని చెప్పారు. తనకు అమిత్ షా ను కలవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక పక్క గరికపాటి నడవలేని స్థితిలో ఉంటే, ఆయనతో కలిసి అమిత్ షా ను కలిసానని, వార్తలు వస్తుంటే, ఇంకా ఈ విషయం పై నేనేమి చెప్పను అంటూ మీడియాను ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాని, సీనియర్ నాయకులు కాని, ఢిల్లీకి వెళ్తున్నారు అంటేనే ఎదో పాపం చేసినట్టు చూస్తున్నారని అన్నారు. తన పై ఎవరూ ఒత్తిడి తేలేరని, తనను ఎవరూ ఒత్తిడి చెయ్యలేరని, నేను వ్యాపారవేత్తను కాదని సత్యప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలైంది అని, చంద్రబాబు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, తెలుగుదేశం పార్టీని వీడి ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేసారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మల్యే కూడా పార్టీ మారారని, అందరూ టచ్ లోనే ఉన్నారని అనగాని స్పష్టం చేసారు.