ఏపీ కొత్త క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారన్న దానిపై ఈ సాయంత్రం స్పష్టత వచ్చింది. సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించడంతో మంత్రి పదవులు దక్కించుకున్నది వీళ్లేనంటూ మీడియాలో ప్రసారమైంది. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవాళ వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి వస్తుందని 100 శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా న్యాయం చెయ్యడం, జగన్ కు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యాలని చెప్పారు. కానీ, క్యాబినెట్ మంత్రుల జాబితాలో రోజా పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని జగన్ తెలిపినట్టు సమాచారం.

అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రోజాకు మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తిరుమల వచ్చినప్పుడు రోజా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. తద్వారా మంత్రి పదవి రేసులో తాను ముందున్నానని సంకేతాలు పంపారు. అనూహ్యంగా ఆమె పేరు లేకుండానే జగన్ తన క్యాబినెట్ ను ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు గానూ వైకాపా 151 స్థానాలు దక్కించుకుంది. అందులో 14 మంది మహిళలు ఉన్నారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు అనే పేరు వినిపించగానే ప్రముఖంగా రోజా పేరే అందరి నోటా నానింది. అటువైపు పార్టీ తరఫున బలంగా వాణి వినిపించే మహిళా నేతగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. అయినా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం గమనార్హం. అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా సరే.. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురిలో సుచరిత మినహా మిగిలిన ఇద్దరూ రోజాలానే రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం.

మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అందులో మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపించాయి. మరో మంత్రి పదవి విషయంలో రోజాకు, భూమన కరుణాకర్‌రెడ్డికి మధ్య పోటీ ఉందని అందరూ అనుకున్నారంతా. వస్తే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి పదవి వస్తుందని ఊహించినప్పటికీ.. అనూహ్యంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామికి చోటు దక్కడం గమనార్హం. మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్‌.. మరో రెండున్నరేళ్ల తర్వాతే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ఇదివరకే స్పష్టం చేశారు. ఆ జట్టుతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారన్నమాట. దీని ప్రకారం చూస్తే రోజాకు మంత్రివర్గంలో అవకాశం దక్కాలంటే మరో రెండున్నరేళ్ల ఎదురుచూడాల్సిందేనా? లేదా మంత్రి పదవి బదులు ఇంకేదైనా పదవి ఇస్తారో చూడాలి!! జగన్, రోజాని విజయవాడలోనే అందుబాటులోనే ఉండాలి అని చెప్పటంతో, రోజా వర్గీయాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read