ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజే జనసేన అధినేతకు ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి రావెల ఓడిపోయారు.ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు...బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.