ప్రధాని గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనం తరం నరేంద్ర మోదీ తొలిసారిగా తిరుమల రానున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని తిరుగుప్రయాణమవుతారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ శనివారం సాయంత్రమే తిరుమలకు రానున్నారు. అమరావతిలో మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం, తేనీటి విందు ముగిశాక వీరిద్దరూ తిరుమలకు బయల్దేరనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40నుంచి 5.10 మధ్య అక్కడికి సమీపంలోనే ఉన్న కార్బన్ సెల్‌ఫోన్ కంపెనీ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకుంటారు.
పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. వెంటనే బయల్దేరి మహద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొంటారు. రాత్రి 8.15కి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ బయల్దేరతారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని గురువాయూర్ ఆలయ దర్శనానికి బయలుదేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. ఈ మధ్యలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, రేణిగుంట నుంచి అలిపిరి వరకు, ఇరు వైపులా మానవహారంలాగా ప్రజలను నుంచో పెట్టి ప్రధాని కాన్వాయ్ పై పువ్వులు చల్లే కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తుంది. మొన్న కేసిఆర్ తిరుమల పర్యటనలో కూడా ఇలాగే గ్రాండ్ వెల్కం పలికారు. మొన్నటి దాక మన హక్కులు విషయంలో మోడీ అన్యాయం చేసారని, ప్రజలు నిరసనలతో స్వగతం పలికారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, జగన్ గారు, ప్రధాని మోడీకి, పువ్వులతో స్వాగతం పలకనున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రధాని కనికరించి, మన హామీలు నెరవేరుస్తారాని ఆశిద్దాం...