ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజావేదికను తనకు కేటాయించాలని సీఎం జగన్ కు చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయగా.. ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమన్నట్లు రఘురాం తెలిపారు. టీడీపీ, వైసీపీలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉండవల్లిలోని ప్రజావేదిక భవనాన్ని తన నివాసానికి అనుబంధ భవనంగా అధికారికంగా కేటాయించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఉండవల్లిలో తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రైవేటు భవనంలోనే ఇకపైనా కొనసాగనున్నానని, ఆ నేపథ్యంలో తన నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని అధికారిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, శాసనసభాపక్ష సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి వీలుగా అనుబంధ భవనంగా ప్రకటించాలని ఆయన కోరారు. ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదికను నా నివాసానికి అనుబంధ భవనంగా ప్రకటించాం. చుట్టుపక్కల ఖాళీ ప్రదేశమేదీ లేని నేపథ్యంలో వివిధ సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి ఆ భవనాన్నే వినియోగిచాం. నేను నివసిస్తున్న ప్రైవేటు భవనంలోనే...ఆ భవన యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇకపైనా కొనసాగుతాను. నేను శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం మీకు తెలుసు. ఆ నేపథ్యంలో నా నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని నా అధికారిక కార్యకలాపాల కోసం ఉంచుకోవాలని భావిస్తున్నాను. అనుబంధ భవనంగా ప్రకటించాలని కోరుతున్నాను. నా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయమని కోరుతున్నాను’’ అని జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.