వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సరిగ్గా పది గంటలకు వైసీపీఎల్పీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో కేబినెట్ కూర్పు, ప్రజాకర్షక పథకాలు, పరిపాలనపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం కేబినెట్ భేటీలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో వైసీపీ సీనియర్ నేత, పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు కాగా.. మిగిలిన నలుగురు ఎవరనేది తెలియాల్సి ఉంది.
కాగా.. ఇంతవరకూ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి మించి ఇంతవరకూ డిప్యూటీ సీఎంలుగా నియమించిన దాఖలాల్లేవ్. ఇదిలా ఉంటే.. మొత్తం 25 మంది మంత్రులతో జగన్ పూర్తిస్థాయి కేబినెట్ ఉండనుంది. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్లో కొత్తవారికి అవకాశం ఇస్తామని జగన్ తెలిపారు. మంత్రి వర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వైసీపీ శాసన సభా పక్ష సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చారు జగన్. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలన్న సీఎం జగన్.. ఆరోపణలు వచ్చిన పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామన్నారు.
జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సీనియారిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే మంత్రుల జాబితా రూపొందించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రాంతాలు, సమతుల్యత, సామాజిక వర్గాలు జగన్‌తో కలిసి పనిచేసినవారు, సీనియర్లు, పార్టీకి భవిష్యత్తులో పనికివచ్చే వ్యక్తులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ జాబితాను రూపొందించినట్లు ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఉదయం 11.49 గంటలకు ఉండనుంది. సచివాలయం దగ్గర్లోనే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడకు వెళ్తున్నారు. శనివారం ఆయన కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.