సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పక్షాన ఒక పత్రిక పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలను కార్యకర్తలు, ప్రజలకు తెలియజేసేందుకు పార్టీ పక్ష పత్రికను వెలువరించాలని నిర్ణయించినట్టు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇందులో రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన పాలసీ నిర్ణయాలు, అభివృద్ధి చెందిన రంగాల సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. మేధావులు, కార్యకర్తల అభిప్రాయాలు వెల్లడించడానికి పత్రిక ఒక వేదిక అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకరావడంతోపాటు పరిష్కారం కోసం పక్ష పత్రిక తోడ్పడాలని ఆకాంక్షించారు. పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షికలు ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఒక కమిటీని కూడా వేస్తామని పేర్కొన్నారు. పత్రిక తొలి కాపీని సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని పవన్ స్పష్టంచేశారు.
పత్రిక ఈ మ్యాగజైన్‌తో పాటు ముద్రిత సంచికను కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసిన ప్రజలకు ఆ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. నాలుగేళ్ల పార్టీకి లక్షల ఓట్లు వచ్చాయని .. కానీ ఓటమి కూడా ఒక అనుభవం అని పేర్కొంది. గురువారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ మేరకు సమావేశంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. జనసేన పార్టీకి ఓటేసిన వారితోపాటు పోరాటయాత్ర, ఎన్నికల ప్రచార సభలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్. నాలుగేళ్ల వయస్సున్న జనసేన పార్టీకి లక్షల ఓట్లు రావడం తమ విజయమే తప్ప ఓటమి కాదన్నారు.
అయితే పార్టీని ఎదగనివ్వకుండా కొన్ని శక్తులు పనిచేశాయని .. అందుకే వ్యతిరేక ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. కానీ తమకు బలమైన క్యాడర్ ఉందని ఎన్నికలతో రుజువైందన్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలంటే పార్టీ కోసం పనిచేసేవారంతా .. ఒకతాటిపై, ఒకే ఆలోచనాధోరణడితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ధృడ సంకల్పంతో పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని శ్రేణులను కోరారు. పార్టీ కోసం కనీసం పదేళ్లపాటు పనిచేయగలిగిన వారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. అలాగే తనతో ఉంటే కీర్తి, ప్రతిష్టలు మాత్రమే వస్తాయని .. డబ్బు రాదని స్పష్టంచేశారు. తుదిశ్వాస విడిచే వరకు పార్టీ కోసం అహార్నిసలు శ్రమిస్తానని పవన్ పేర్కొన్నారు. అయితే ఒక్కోసారి ఊహించని ఫలితాలు వస్తాయని .. వాటిని ఎదుర్కొవాలంటే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకుసాగాలని కోరారు.